శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ లో పెద్ద ఎత్తున దశల వారీగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఊహించని రీతిలో హింస జరుగుతోంది. తాజాగా జరిగిన పోలింగ్ వేళ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది. కూచ్ బిహార్ జిల్లా సితాల్ కుచి నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం వెలుపల కేంద్ర పారిశ్రామిక భద్రత దళం కాల్పులు జరపగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ఇదే నియోజకవర్గంలో తొలిసారి ఓటుహక్కును సొంతం చేసుకున్న యువకుడ్ని.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపటం మింగుడుపడనిదిగా మారింది.కాల్పుల్ని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ జరుపుతామని.. కాల్పుల్లో మరణించిన నలుగురు కార్యకర్తలు తమ పార్టీకి చెందిన వారుగా మమత పేర్కొన్నారు. 294 నియోజకవర్గాలున్న బెంగాల్ రాష్ట్రంలో శనివారం 44 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఇంతకీ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది? నలుగురు ప్రాణాలు కోల్పోయంతలా పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్ష్యలు వివిధ మీడియా సంస్థలకు అందించిన సమాచారం ప్రకారం సితాల్ కుచి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను చెదరగొట్టటానికి కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో.. ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో స్థానిక పోలీసుల నుంచి తుపాకులు లాక్కునే ప్రయత్నం జరిగింది.
ఒక వాహనం ధ్వంసం చేశారు. దీంతో.. జవాన్లు కాల్పులు జరిపినట్లుగా సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో పోలింగ్ నిలిపివేసినట్లుగా ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే.. ఈ వాదనకు భిన్నంగా మరో రెండు వాదనలు వినిపిస్తున్నాయి,అందులో ఒకటి.. పోలింగ్ వేళ.. పడిపోయిన వ్యక్తికి భద్రతా సిబ్బంది సపర్యలు చేస్తుండగా.. భద్రతా వర్గాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రచారం జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో తోపులాటలో ఒక చిన్నారికి గాయాలు కావటం కూడా హింసకు కారణమైందని చెబుతున్నారు. బెంగాల్ లో మరో నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరో 71 కంపెనీల అదనపు సాయుధ బలగాల్ని పంపాలని ఈసీ కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఈ కాల్పులు ఉదంతంపై ప్రధాని మోడీ వర్సెస్ సీఎం మమతల మధ్య మాటల యుద్ధం జరగటమే కాదు.. ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాల్ని సంధించుకున్నారు. ఏం.. జరిగినా ఐదు ప్రాణాలు పోవటం దారుణమని చెప్పక తప్పదు.