ఫ్లైట్ లో ప్రయాణించే వేళ.. బాత్రూంకు వెళ్లిన ఆ ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 4 గంటల పాటు ఫ్లైట్ బాత్రూంలో ఇరుక్కుపోయిన అతగాడి పరిస్థితిని ఊహించుకుంటే చెమటలు పట్టాల్సిందే. ఇక.. ఫోబియోలు ఉన్నోళ్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే? ఊహించేందుకు సైతం కష్టంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ముంబయి నుంచి బెంగళూరు వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో చోటు చేసుకున్న ఒక అరుదైన ఉదంతం గురించి తెలిసిన వారంతా.. రాబోయే రోజుల్లో తమ ప్రయాణాల్లో భాగంగా బాత్రూంకు వెళ్లాల్సి వస్తే..ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి. ముంబయి నుంచి ల్యాండ్ అయ్యాక.. స్పైస్ జెట్ లోని ప్రయాణికుడు ఒకరు.. బాత్రూంకు వెళ్లారు.
లోపలకు వెళ్లి.. పని పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. డోర్ ఓపెన్ కాలేదు. దీంతో.. తాను లోపలే ఉన్నానని.. తలుపు తీయాలంటూ రిక్వెస్టు చేశాడు. తాను లోపల చిక్కుకుపోయిన విషయాన్ని తెలియజేస్తూ.. డోర్ ను బాదటంతో.. తోటి ప్రయాణికులు కొందరు గుర్తించి ఎయిర్ హోస్టెస్ కు సమాచారం ఇచ్చారు. వారెంతగా ప్రయత్నించినా ఫలితం లేని పరిస్థితి.
తలుపు తెరుచుకోకపోవటంతో.. చిన్న చీటి ద్వారా.. ఆందోళన చెందొద్దు. కమోడ్ సీటు మీద కూర్చోండి. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక.. డోర్ ఓపెన్ చేయిస్తామని పేర్కొన్నారు. విమానం కాస్తా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక.. ఇంజినీర్లకు కబురు పెట్టి.. వారు వచ్చి.. డోర్ ఓపెన్ చేసే సరికి నాలుగు గంటలు పట్టింది. ఈ నరకంతో సదరు ప్రయాణికుడు బెదిరిపోయిన పరిస్థితి. ప్రయాణికుడి చేదు అనుభవం నేపథ్యంలో.. అతడి టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని స్పైస్ జెట్ పేర్కొంది. అయితే.. ఈ ఉదంతంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. చదవటానికి బాగానే ఉన్నా.. ఈ పరిస్థితిని ఒకసారి ఊహించుకుంటే చెమటలు పట్టాల్సిందే కదూ?