మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు అన్ని వ్యాపారాలు మహా జోరుగా సాగుతుంటాయి. మరో రోజులో (డిసెంబరు 23) కొత్త పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్ లో భారీగా వివాహాలు జరగనున్నాయి.
పెళ్లిళ్ల సందర్భంగా దేశ వ్యాప్తంగా జరిగే పెళ్లిళ్లు ఎన్ని అన్న అంచనాతో పాటు.. ఆ సందర్భంగా జరిగే లావాదేవీలు.. వ్యాపారం ఎంత భారీగా ఉంటుందో లెక్క కట్టింది వ్యాపారుల సమాఖ్య కాయిట్. తాజాగా తయారు చేసిన నివేదికలో పలు ఆసక్తికర వివరాల్ని వెల్లడించింది. రానున్న 23 రోజుల్లో దేశ వ్యాప్తంగా 38 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని.. ఆ సందర్భంగా రూ.4.474 లక్షల కోట్ల వ్యాపారం జరగనున్న విషయాన్ని వెల్లడించారు.
పెళ్లిళ్ల సందర్భంగా అవసరమైన వస్తువుల.. వివిధ సేవల కోసం వినియోగదారులు భారీగా ఖర్చు చేయనున్నారు. గత ఏడాదిలోజరిగిన పెళ్లిళ్ల సీజన్ తో పోలిస్తే.. ఈఏడాది దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా డబ్బులు ఖర్చు చేయనున్న విషయాన్ని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న వస్తు.. సేవలకు సంబంధించిన వాణిజ్య సంస్థలు ఇచ్చిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్లుగా తెలిపారు.
గత ఏడాది 32 లక్షల పెళ్లిళ్లు జరగ్గా.. సుమారు రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. నవంబరు చివరి వారంలో ఐదు మంచి తేదీలు (పెళ్లిళ్లకు అనువుగా) ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిల్లో 23, 24, 27, 28, 29 తేదీలు ఉన్నాయి.
24న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. డిసెంబరు విషయానికి వస్తే 3, 4, 7, 8, 9, 15 తేదీలు వివాహానికి సరైన శుభఘడియలుగా చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని.. ఈ సందర్భంగా రూ.1.25 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని పేర్కొన్నారు. వాస్తవానికి నగరాలతో పాటు పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లు.. ఆ సందర్భంగా జరిగే ఖర్చు.. వాటితో అయ్యే వ్యాపారం లెక్క చూస్తే.. కాయిట్ పేర్కొన్న అంచనాలకు రెట్టింపుకు పైనే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.