దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి బీజం వేసిన సంగతి తెలిసిందే. ఆ విజయం ఇచ్చిన ఊపుతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరింత దూకుడుతో వ్యవహరించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని రెండో అతి పెద్ద పార్టీగా నిలబెట్టారు. బల్దియా వార్ తర్వాత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పోటీ తామేనని చెప్పిన సంజయ్…2023లో తెలంగాణలో బీజేపీదే అధికారమని చాలాసార్లు చెప్పారు. బల్దియా ఎన్నికల గెలుపుతో విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ క్రమంలోనే తాజాగా బండి సంజయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 30 మంది వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. కానీ, తాము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని, అందుకే తమతో టచ్ లో ఉన్న వారిని పార్టీలోకి తీసుకోవడం లేదని అన్నారు. 2023లో బీజేపీదే అధికారమని, తమకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని సంజయ్ మరోసారి స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల గుర్తింపు కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదని,జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి ఎన్నిక ప్రక్రియను టీఆర్ఎస్ కావాలనే జాప్యం చేస్తోందని సంజయ్ ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశామని సంజయ్ చెప్పారు. కేసీఆర్, ఓవైసీ చెప్పిందే ఎస్ఈసీ అమలు చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎంఐఎం చీకటిపొత్తుతోనే టీఆర్ఎస్ కు కొన్ని సీట్లు వచ్చాయని విమర్శించారు. పాలక మండలి నియమించడానికి రెండు నెలలు సమయముందన్న కేసీఆర్, 3 నెలల ముందే ఎన్నికలను ఎందుకు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు. దోపిడీ దొంగల్లాగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డగోలుగా అక్రమాలు చేస్తున్నారని, అన్నీ దోచుకున్నాకే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ చేతిలో ఎస్ఈసీ కీలుబొమ్మగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు.