మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…మచ్చుకైనా లేడు చూడు….మానవత్వం ఉన్నవాడు…అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న ఆర్ధ్రతతో పాడిన పాట మనసున్న మనుషులందరనీ కదిలించింది. పాషాణ హృదయాలతో ఉన్న కరుడుగట్టిన మనుషుల గురించి వెంకన్న చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనేక ఘటనలు నిరూపించాయి. మనుషుల రూపంలో ఉన్న కొందరు రాక్షసులు సాటి మనుషులను కసాయిల్లా మారి కడతేరుస్తున్న వైనాలు మనసులను కలచివేస్తున్నాయి.
ఆస్తి కోసం అన్నదమ్ములను చంపుకుంటున్న ఘటనలు…పరువు కోసం కన్న కూతురును కానరాని లోకాలకు పంపేందుకు సిద్ధపడుతున్న తల్లిదండ్రులు….ఇలా అనేక ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ లో జరిగిన హత్యోదంతం గురించి వింటే మానవత్వం ఎప్పుడో చచ్చిపోయిందనిపించక మానదు. అన్న కుటుంబంపై సొంత తమ్ముడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన ఘటన విన్నవెంటనే ఒళ్లు గగుర్పొడచక మానదు. అన్న, వదినలతో పాటు మరో వ్యక్తిని విచక్షణారహితంగా తమ్ముడు నరికిచంపిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఈ ఘటనలో అన్న కుమారులిద్దరూ తీవ్రగాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వరంగల్ ఎల్బీ నగర్లో మహమ్మద్ చాంద్ పాషా పశువుల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబంతో జీవిస్తున్నారు. తమ్ముడు షఫీతో చాంద్ పాషాకు ఏడాదిగా ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరుగుతోంది. సుమారు రూ.కోటి విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే అన్నపై అక్కసు పెంచుకున్న తమ్ముడు కక్షతో రగిలిపోతున్నాడు. అదునుచూసి అన్న కుటుంబాన్ని లేపేయాలనుకున్న షఫీ… చాంద్‌పాషా ఇంటికి వెళ్లి చంపాలని సినీ ఫక్కీలో ప్లాన్ వేశాడు.
తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో షఫితో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాంద్‌పాషా ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించారు. గాఢ నిద్రలో ఉన్న చాంద్‌పాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు సహేద్, సమీర్, బావమరిది ఖలీల్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో చాంద్‌బాషా, సబీరా బేగం, ఖలీల్ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. చాంద్ పాషా కుమారులిద్దరూ తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాబాయి షఫీయే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చాంద్‌పాషా కుమార్తె రుబీనా పోలీసులకు తెలిపింది. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు…నిందితుల కోసం గాలిస్తున్నారు.