ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కీలక వైసీపీ నాయకుల నామినేషన్లపై అనర్హత కత్తి వేలాడుతోంది. వీటిని దాదాపు తిరస్కరించే అవకాశం ఉండడంతో పార్టీలోనూ కలకలం రేగింది. పైగా ఆయా నామినేషన్లు వేసిన వారు.. తమకు డమ్మీగా మరొకరిని ఎంపిక చేసుకోకపోవడంతో.. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీనేతలు అనర్హులు అయితే.. ఇబ్బందులు తప్పేలా లేవని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో పోటలో లేనట్టే అవుతుం దని చెబుతున్నారు.
డోన్: వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుంచి వరుసగా పోటీలో ఉన్నారు. వైసీపీలో తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు ఇప్పుడు ఆదిలోనే చిక్కులు వచ్చాయి. ఆయన వేసిన నామినేషన్లో ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని.. ప్రత్యర్థి పార్టీ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గన నామినేషన్ను పరిశీలించిన ఆర్వో.. దీనిని పెండింగులో పెట్టారు. బుగ్గన తరఫు న్యాయవాది వివరణ తీసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అయితే.. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఒకసారి నామినేషన్ వేసిన తర్వాత.. మళ్లీ వివరణ తీసుకునే సంప్రదాయంలేదని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
పెందుర్తి: విశాఖపట్నం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెందుర్తి. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున అదీప్ రాజ్ పోటీ చేస్తు న్నారు. గత ఎన్నికల్లోనూ ఈయనే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ సారి ఆయన దాఖలు చేసిన నామినేషన్ కూడా తొలిదశలోనే వివాదంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలను అదీప్ రాజు పేర్కొనలేదు. దీనిని గమనించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఈ నామినేషన్ను కూడా పెండింగులో పెట్టారు. అయితే.. పెండింగులో పెట్టడం కాదు.. తిరస్కరించాలని జనసేన అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు.
గుడివాడ: ఇక్కడ నుంచి వరుసగా ఐదో సారి వైసీపీ నాయకుడు ఫైర్ బ్రాండ్ కొడాలి నాని పోటీ చేస్తున్నారు. అయితే.. ఈయన సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వ కార్యాలయాన్ని తాను ఎప్పుడూ వినియోగించుకోలేదని పేర్కొన్నారు. దీనిని గమనించిన టీడీపీ నేతలు.. గతంలో అనేక సార్లు ఆయన ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకున్నారని.. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారని.. పేర్కొంటూ ఆధారాలతో సహా సమర్పించారు. దీంతో కొడాలి నాని నామినేషన్ను కూడా రిటర్నింగ్ అధికారి పెండింగులో పెట్టడం గమనార్హం. మరి ఇవి.. పరిష్కారం అవుతాయా? అందే.. 90 శాతం కష్టమేనని.. ఎందుకంటే.. వీరికి అవకాశం ఇస్తే.. మరి కొందరు నాయకులు కూడా కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. సో.. ఏం జరుగుతుందో చూడాలి.