మాక్ ఆక్సిజన్ డ్రిల్ పేరుతో అయిదు నిమిషాల పాటు కరోనా రోగులకు ఆక్సిజన్‌ను నిలిపివేసింది ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం. ఫలితంగా 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు అంటున్నారు.
ఏప్రిల్ 26వ తారీకున యూపీలోని ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో అత్యంత క్రూరమైన ఈ చర్య పట్ల విచారణకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్ 26న 96 మంది కరోనా రోగులు ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్నారు. ఆక్సిజన్ కొరత ఉంటే ఏదో విధంగా ప్రయత్నాలు చేసి రోగులకు అందించాల్సింది పోయి ఆ ఆసుపత్రి యజమాని అరింజయ్ జైన్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు.
ఏప్రిల్ 26వ తారీఖున ఉదయం 7 గంటల సమయంలో ఓ ఐదు నిమిషాల పాటు రోగులందరికీ ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయించాడు. ఫలితంగా 22 మంది రోగుల పరిస్థితి ఐదు నిమిషాల్లోనే విషమించింది. వాళ్ల శరీరం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో వెంటనే ఆక్సిజన్ సరఫరాను ఆ 22 మందికి పునరుద్ధరించారు. మిగిలిన 74 మందికి ఆక్సిజన్ లేకపోయినా కూడా తీవ్ర ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు.
మాక్ డ్రిల్ కోసమే!
నిజంగా ఆక్సిజన్ అవసరం ఎవరికి ఉందో తెలుసుకునేందుకు ఈ మాక్ డ్రిల్ చేసినట్టుగా ఆ యజమాని సమర్ధించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో ఈ చర్య కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మీడియాలో ప్రముఖంగా కథనాలు ప్రసారం కావడంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలెర్టయింది. ఈ ఘటనపై ఆగ్రా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ‘ఆ వీడియోను మేము కూడా చూశాము. దీనిపై విచారణ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాము’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్సీ పాండే స్పష్టం చేశారు.