ఎన్నికల నగారా మోగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలతో పాటు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడనున్నాయి.
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఇదే:
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ: ఏప్రిల్ 18
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల స్క్రుటినీ తేదీ: ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 29
ఏపీలో పోలింగ్ తేదీ: మే 13
కౌంటింగ్, ఫలితాల వెల్లడి: జూన్ 4
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలు జరిగే తేదీలలోనే ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 7 దశలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అందులో మూడో దశలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుండగా… తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
లోక్సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 21న రెండో దశ, మే 7వ తేదీన మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.