2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా మన్ ప్రకటించారు. ద్రవ్య లోటు 6.9 శాతంగా పేర్కొన్నారు. 2025-26 నాటికి 4.5 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లుగాఉందని తెలిపారు.. ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్టు సంచలన ప్రకటన చేశారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీని ఈ ఏడాది నుంచే ప్రవేశ పెడుతున్నట్ట వివరించారు.
కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. విద్యుత్ రంగ సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళిక, నిధులు కేటాయించినట్టు వివరించారు. విద్యుత్ సంస్థలను పునరుత్తేజ పరిచేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలులో నవీకరణ చేయనున్నట్టు నిర్మల వివరించారు.
సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు చేయనున్నట్టు చెప్పారు. తద్వారా.. సంస్థలు పుంజుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ డిడక్షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్టు నిర్మల వివరించారు. డిజిటల్ కరెన్సీ ఆదాయంపైనా పన్ను ఉంటుందన్నారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలను జనాభా ప్రాతిపదికన ఇవ్వనున్నట్టు చెప్పారు.