టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి(ఆగస్టు 12) రెండు నెలలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి రెండు మాసాలు తక్కువ సమయమే. అయితే .. విజన్ ఉన్న నాయకుడిగా, 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చూస్తే.. ఈ స్వల్ప సమయానికి కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో చంద్రబాబు నవ పాలన ఎలా ఉందన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. రెండు మాసాల్లో చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలపైనా చర్చ సాగుతోంది.
ప్రధానంగా పాలనా యంత్రాన్ని తనదైన శైలిలో మార్పులు చేయడం ద్వారా అధికారులపై చంద్రబాబు పట్టు సాధించారు. ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ల వరకు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే మార్పులు చేశారు. తద్వారా.. కూటమి సర్కారు లక్ష్యాలను సాధించేవారికి, మనసెరిగి పనిచేసేవారికి ఆయన పెద్దపీట వేశారు. ఇదే సమయంలో గత వైసీపీ సర్కారు ప్రాధాన్యాలను వదిలి పెట్టని వారిని దూరంగా ఉంచారు. తద్వారా.. పాలనా యంత్రాంగంపై చంద్రబాబు తనదైన ముద్ర వేశారు.
సంక్షేమం-అభివృద్ధిని సమప్రాధాన్యంలో ముందుకు నడిపిస్తానని చెప్పిన చంద్రబాబు.. అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ది అంటే.. దీనిని రెండు రకాలుగా తీసుకుంటున్నారు. 1) పెట్టుబడులు సమీకరించడం, 2) యువతకు అవకాశాలు కల్పించడం. ఈ రెండు విషయాల్లోనూ దూకుడుగానే ఉన్నారు. పలు కంపెనీలను ఆహ్వానించారు. అదే విధంగా గతంలో వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించి.. తర్వాత.. వైసీపీ దెబ్బతో దూరమైన కంపెనీలను తిరిగి పిలుస్తున్నారు.
ఇవి వస్తే.. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెరుగుతాయి. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఇక, యువతకు అవకాశం కల్పించే విషయంపైనా దృష్టి పెట్టారు. ఒకవైపు సర్కారీ కొలువులు, మరోవైపు ప్రైవేటుకు దన్ను ఇవ్వడం ద్వారా చంద్రబాబు దూకుడుగానే ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఇక, సంక్షేమం విషయంలో పింఛన్లతో పాటు.. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెలలోగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
అదే విధంగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇస్తున్న నిధులతోపాటు.. సొంతగా నిధులు సమీకరించి.. అమరావతిని సాధ్యమైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఇక, కీలకమైన రహదారుల నిర్మాణానికి కూడా అక్టోబరులోనే శ్రీకారం చుట్టనున్నారు. పీ-4 విధానంలో వీటిని నిర్మించేందుకు ఇప్పటికే బాబు ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా రెండు మాసాల నవ పాలనలో చంద్రబాబు మంచి మార్కులే పడుతున్నాయి.