గోదారి గట్టున ఉండే భారీ వృక్షం నేలకూలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వృక్షాలు ఉన్నప్పటికి ఇది సమ్ థింగ్ స్పెషల్. దాదాపు 150ఏళ్లకు పైగా గోదారి గట్టున సగర్వంగా నిలిచిన ఈ మహా వృక్షం తాజాగా నేలకూలింది. ఎన్నో విపత్తులను చూసి.. వాటిని ఎదుర్కొని నిలిచిన ఈ వృక్షం ఇప్పుడు మాత్రం శాశ్వితంగా సెలవు తీసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున రాజసాన్ని తలపించేలా ఉండే ఈ భారీ చెట్టు దాదాపు 300లకు పైగా సినిమాల్లో ఎన్నో సన్నివేశాలకు కొత్త అందాల్ని దిద్దింది. ఈ నిద్రగన్నేరు మహా వృక్షం తాజాగా నేలకూలింది. ప్రముఖ దర్శకులు బాపు.. కె. విశ్వనాథ్.. కె. రాఘవేంద్రరావు తదితరులు తమ సినిమాల్లోని సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు ఈ చెట్టును వాడేవారు.
సినీ సూపర్ స్టార్లు అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని రెబల్ స్టార్ క్రిష్ణంరాజు.. సూపర్ స్టార్ క్రిష్ణ.. మెగాస్టార్ చిరంజీవి.. బాలక్రిష్ణ.. మోహన్ బాబు తదితర అగ్రహీరోల సినిమాలను ఇక్కడే షూట్ చేశారు. 1975లో విడుదలైన పాడి పంటలు మూవీలో ఈ చెట్టు హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమా షూటింగ్ లు ఈ భారీ చెట్టు బ్యాక్ గ్రౌండ్ లో జరిగేవి. ఎన్నో వందల సినిమాలకు సాక్ష్యంగా నిలిచే ఈ చెట్టును అటు ప్రభుత్వాలు కానీ.. ప్రభుత్వ యంత్రాగం కానీ పెద్దగా పట్టించుకోలేదు.
వారి నిర్లక్ష్యాన్ని భరించలేకపోయిందో ఏమో కానీ.. చివరకు నేలకూలింది. ఏటా గోదారి వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి.. చివరకు చెట్టు మొదలు రెండుగా చీలిపోవటంతో పడిపోయింది. 150ఏళ్ల ఘన చరిత్ర ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయింది.