టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మధ్యాహ్నం నుంచి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ రెండు వారాలపాటు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. సీఐడీ అధికారులు, ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి సెప్టెంబర్ 22 వరకు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనలు నిర్వహించవద్దని ఆదేశించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు బయట భారీ సంఖ్యలో పోలీసులను, పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవాడ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబును రాజమండ్రి తరలించేందుకు ముందస్తుగానే పోలీసులు రెండు కాన్వాయ్ లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఒక కాన్వాయ్ లో చంద్రబాబును తీసుకువెళ్లబోతుండగా, మరో కాన్వాయ్ లో పోలీసు వాహనాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా రాజమండ్రికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ చంద్రబాబు రూట్ మ్యాప్ లో పకడ్బందీగా పోలీసులను మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇక, చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.