ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన సంయుక్తంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా జనసేన-టీడీపీల మినీ మేనిఫెస్టో ను ప్రకటించింది.
టీడీపీ ప్రతిపాదించిన 6 అంశాలు, జనసేన తాజాగా ప్రతిపాదించిన 5 అంశాలు మొత్తం కలిపి 11 అంశాలతో ఈ మినీ మేనిఫెస్టో విడుదలైంది. ఇక, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన తరఫున ‘పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ పేరిట ఇన్చార్జిలను నియమించారు. రేపటి నుంచి 3 రోజులపాటు టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నాయి. జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిన అజెండా ప్రకారం క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు ఎలా కలిసి పని చేయాలి అన్న విషయాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు వివరించబోతున్నారు. ఇక, ఈ నెల 17 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఇంటింటికి వెళ్లే కార్యక్రమం కూడా ఈ ఇన్చార్జిల ఆధ్వర్యంలోనే జరగనుంది. భవిష్యత్తుకు గ్యారెంటీపై, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు వీరు కార్యాచరణ రూపొందిస్తారు.
ఈ రోజు జరిగిన కమిటీ సమావేశంలో యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ టీడీపీ తరఫున హాజరయ్యారు. జనసేన నుంచి వరప్రసాద్, శశిధర్, శరత్ కుమార్ హాజరయ్యారు. టీడీపీ-జనసేన మినీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు అదనంగా మరిన్ని అంశాలు జోడించి తుది మేనిఫెస్టోను ఈ కమిటీ రూపొందించనుంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎజెండాగా ఉమ్మడి మేనిఫెస్టోను ఈ కమిటీ సభ్యులు రూపకల్పన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.