ఏపీలో మరో 10 కోట్ల రూపాయల దుబారాకు ప్రభుత్వం రెడీ అయిందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. దీనికికారణం..ఈ నెల 25న ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్లో పేదలకు పట్టాలు పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండడమే. దాదాపు 1163 ఎకరాల స్థలాన్ని ఇక్కడి రాజధాని ప్రాంతం నుంచి సేకరించిన ప్రబుత్వం గుంటూరు, ఎన్టీఆర్(ఉమ్మడి కృష్ణా) జిల్లాల్లోని పేదలకు పంచుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్లాన్ చేసుకున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా వుంటే.. అసలు ప్రభుత్వం జగనన్న ఇళ్లు పథకం కింద ఇప్పుడు పంచే ఇళ్ల పట్టాలకు ప్రాధాన్యం లేదు. ఎందుకంటే.. ఇస్తున్న పట్టాలకు వాల్యూ లేకపోవడమే దీనికి కారణం. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అమరావతి రాజధానిపై తుది తీర్పునకు లోబడి ఈ పట్టాల పంపిణీ ఉంటుందని.. ఈ విషయంలో పట్టాలు పొందుతున్నవారికి ఎలాంటి హక్కులూ ఉండబోవని పేర్కొంది.
అంటే.. ప్రభుత్వం ఇస్తున్న పట్టాలకు బ్యాంకులు అప్పులు ఇవ్వవు. రేపు అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తే.. ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని కోర్టులు ఆదేశించినా.. తదుపరి వచ్చే ప్రభుత్వాలు ఆదేశించినా.. ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని.. ఇక్కడ నుంచి కట్టుబట్టలతో ఖాళీ చేయాలే తప్ప.. తమకు గూడు చూపించండని కోరే హక్కులు కూడా లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. అసలు ఈ విషయాన్ని న్యాయపోరాటంగా కూడా మలిచేందుకు అవకాశం లేదంది.
మరి అలాంటి పట్టాలు పంచుతున్న కార్యక్రమానికి ప్రభుత్వం ఏకంగా.. రూ.10 కోట్లను విడుదల చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. చలువ పందిళ్లు… పట్టాలు తీసుకున్న వారితోపాటువారి కుటుంబాల కు షడ్రశోపేతమైన భోజనాలు, వలంటీర్లకు బహుమానాలు.. ప్రజలను తీసుకువచ్చితీసుకువెళ్లేందుకు బస్సుల ఏర్పాటు, మధ్యలోవారికి అల్పాహారం వంటివి ఏర్పాటు చేయడానికిరూ.10 కోట్లు వెచ్చించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపైనే విపక్షాలు మండిపడుతున్నాయి.