అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ అధర్మ యుద్దమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే ఆ పార్టీ సిద్దాంతమని విమర్శించారు. నాడు(2019) అధికారం కోసం ఎలా అయితే తప్పుడు అరోపణలు, అసత్య ప్రచారాలు చేశారో ఇప్పుడు కూడా అదే పంథాలో వైసీపీ పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత ఎఫెక్టివ్ గా, ఎటాకింగ్ గా తూర్పార బట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి మీడియాతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీ కార్యాలయంలో అధికార ప్రనినిధులు, నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. నిరంతరం అప్డేట్ అవుతూ.. లోతైన కసరత్తుతో పార్టీ అధికార ప్రతినిధులు గళం వినిపించాలని అన్నారు.
మీడియాలో మాట్లాడమే కాకుండా ఆయా అంశాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సోషల్ మీడియాలో వైసీపీ నిత్యం ఫేక్ పోస్టులతో ఎంత గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారో కూడా చూస్తేనే ఉన్నామని అన్నారు. అన్ని వేదికలపై వైసీపీ దురాగతాలను ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.
రెండు రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగనున్న ఈ వర్క్ షాప్ లో అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్ల లో పాల్గొనే వారు, పార్టీ కి మద్దతుగా సోషల్ మీడియాలో గళం విప్పుతున్న పలువురు నాయకులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి.. చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైసీపీ విలువలు లేని రాజకీయ పార్టీ అని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వైసీపీ సిద్దాంతమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం జగన్ సర్కార్ అని దుయ్యబట్టారు.
నాడు అధికారం కోసం ఎలాగయితే తప్పుడు అరోపణలు, అసత్య ప్రచారాలు చేశారో.. ఇప్పుడూ అదే పంథా అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడానికి మీడియాతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.