విశాఖ కేంద్రంగా రాజధాని అనుకున్న రోజు నుంచి ఇప్పటిదాకా ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది.
ముఖ్యంగా రాజధాని నిర్మాణం అన్నది అనుకున్నంత సులువేం కాదు. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఏమీ లేని రాష్ట్రం మనది.
అలాంటప్పుడు జీతాలు కూడా ఇచ్చుకోలేని రాష్ట్రం మనది. ఇవి ప్రధాన కారణాలుగా ఉంటూ విశాఖకు రాజధాని అని చెప్పడం కాస్త కాదు చాలా నవ్వు తెప్పించే విషయమే ! ఎందుకంటే అమరావతిలో ఆగిపోయిన ఏ ఒక్క నిర్మాణాన్నీ జగన్ పూర్తి చేసేందుకు ముందుకు రావడం లేదు.
వాటిని పూర్తి చేస్తే కాస్తో కూస్తో పాలన సంబంధం అయిన సౌలభ్యం ఒకటి అందుబాటులోకి వస్తుంది. పాలనకు సంబంధించి ఓ స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవేవీ పట్టని విధంగా జగన్ ఉన్నారు.
ఇప్పటికీ అమరావతి నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తమకు చెప్పాలని కోర్టు అడుగుతూనే ఉంది.
కానీ అది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక విశాఖ కేంద్రంగా రాజధాని అనగానే ఏం జరిగిందో చూద్దాం.
వాస్తవానికి విశాఖ కేంద్రంగా రాజధాని అనగానే సాయిరెడ్డి ఈ ప్రాంతంపై దృష్టి సారించారు.
సాయిరెడ్డి ఒక్కరే కాదు చాలా మంది వైసీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ స్థలాలూ, పొలాలూ చూసుకున్నారు. కొందరైతే రియల్ వ్యాపారం కూడా మొదలు పెట్టారు.
వీరికి సాయి రెడ్డి అండదండలున్నాయన్న వార్తలు అప్పట్లో విపరీతంగా వచ్చాయి. దీంతో సాయిరెడ్డిని ఎలా అయినా తప్పిద్దాం అనుకున్న జగన్ ఆఖరికి ఆ పని మొన్నటి వేళ చేశారు. సాయిరెడ్డి ప్లేస్ లో వైవీ సుబ్బారెడ్డి వచ్చారు.
రీజనల్ కో ఆర్డినేటర్ గా పనిచేసేందుకు పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఆయన వచ్చినా కూడా సాయి రెడ్డిదే పెత్తనం అయి ఉంది. ఇక సాయి రెడ్డి మనిషిగా పేరొందిన ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ ఎంపీ) కూడా కొన్ని భూ వివాదాల్లో ఇరుక్కున్నారు.
ఆఖరికి ఇక్కడ తాను ఏ వ్యాపారాలు చేయనని కూడా అన్నారు. హైద్రాబాద్ కు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటానని కూడా చెప్పారు. ఇదే అప్పట్లో చర్చకు
తావిచ్చింది.ఆయనకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా వివాదాల్లో ఇరుక్కుపోయింది. అలానే కొన్ని భూ కబ్జాల ఆరోపణలు ఎంపీని ఊపిరి తీసుకోనివ్వలేదు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ కీలక ప్రాజెక్టు దక్కిందని తెలుస్తోంది. అదే కనుక అయితే ఎంపీకి కాస్త ఊరట కూడా ! ఇక వివాదాల కారణంగానే ఆయన జనం మధ్య ఉండడం లేదు.
ఆయన మనుషులుగా పేరొందిన వారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కీలక విశాఖ ఉక్కు విషయమై కూడా పార్లమెంట్ లో ఆయన మాట్లాడిందేమీ లేదు.
ఇంతవరకూ ప్రజా సమస్యలపై పెద్దగా పనిచేసింది లేదు. పరిష్కరించిందీ లేదు. కేవలం సాయిరెడ్డి ఏం చెబితే అదే చేయడం ఆయనకు ఒక అలవాటు గా మారిపోయింది అన్న అపవాదు మాత్రం భరించక తప్పడం లేదు ఆయనకు.