200 రోజులు, 15 జిల్లాలు, 77 నియోజకవర్గాలు, 2007 కిలోమీటర్లు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు…ఒకే ఒక్కడు…అతడే ఒక సైన్యం…ఒక గళం..యువగళం! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకుంది. వైసీపీ నేతలు, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..మొక్కవోని దీక్షతో లోకేష్ సగం రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. సగం యాత్ర పూర్తయ్యేనాటికి శత్రువు వెన్నులో వణుకు పుట్టించాడు లోకేష్. ఇక, 400 రోజుల యాత్ర పూర్తయితే శత్రువు తుడిచిపెట్టుకుపోవాల్సిందే.
ఈ సందర్భంగా తన తనయుడు లోకేష్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు. యువగళంగా ప్రారంభమైన పాదయాత్ర… ప్రజాగళంగా మారిందని ఆయన అన్నారు. లోకేష్ అతని టీమ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. లోకేష్ పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు పలువురు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరోవైపు, చింతలపూడిలో కొనసాగుతున్న పాదయాత్ర సందర్భంగా జగన్ పై నారా లోకేష్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. 3 రాజధానులు కడతానన్న జగన్ ఇప్పటివరకు మూడు ఇటుకలు కూడా పేర్చలేదని లోకేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కెపాసిటీ పోలవరం ప్రాజెక్టు అయితే జగన్ కెపాసిటీ మురికి కాలువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ది దరిద్రపు పాదం అని, ఎప్పుడు విశాఖకు వస్తానన్నా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని లోకేష్ చురకలంటించారు. 40 లక్షలు ఖర్చుపెట్టి ధర్మకోల్ షీట్లతో బస్సు షెల్టర్ కట్టాడని, ఆ పునాదులు లేని బస్ షెల్టర్ చిన్న గాలికే కూలిపోయిందని అన్నారు. జగన్ బొమ్మ రోడ్డుపై పడిందని ఎద్దేవా చేశారు.
పనికిమాలినోడు పందిరేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట అంటూ జగన్ పై లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ 100 తప్పులు పూర్తి అయిపోయాయని, అలిపిరి టోల్గేట్ చార్జి దగ్గర మొదలుపెట్టి చివరకు కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ చేయడం వరకు ఎన్నో తప్పులు చేశారని దుయ్యబట్టారు. లోకేష్ పై చంద్రబాబు కి నమ్మకం లేదు అని జగన్ అంటున్నాడని, జగన్ ను ఆయన తల్లి, చెల్లి నమ్మడం లేదని అన్నారు. ఏపీలో అడుగుపెడితే నీ కాళ్లు విరగ్గొడతా అని వైఎస్ బతికున్న సమయంలో జగన్ ను ఎందుకు అన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ పై వైఎస్ కుటుంబానికి నమ్మకం లేదని, అందుకే ప్రజలంతా నిన్ను నమ్మం జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాదయాత్ర చేసేటప్పుడు అదనపు సెక్యూరిటీ ఇచ్చి చేసుకోమని అనుమతిచ్చామని, ఇప్పుడు పోలీసులను పంపి తన పాదయాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన పాదయాత్రను అడ్డుకుంటే వైసీపీకి అంతిమయాత్రే అని వార్నింగ్ ఇచ్చారు.