అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర టెన్షన్ నెలకొంది. టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో కలకలం రేగింది. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్నార ని గత కొంతకాలంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
అంతేకాదు, అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలను తగులబెడతామని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవలె హెచ్చరించారు. అన్నట్లుగానే సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్త మయ్యారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులను రంగంలోకి దింపారు. ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన 8 మంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. తప్పించుకుని బయటకు వచ్చిన ఆయన్ను పోలీసులు తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీ నేలపై పడిపోయారు. పోలీసుల చర్యలను ఖండించిన జేసీ.. తన ఇంటి ముందే కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. జేసీపై పోలీసుల చర్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కాగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనల వల్లే జేసీని అడ్డుకున్నామని పోలీసులు వెల్లడించారు.