రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఐ నాగేశ్వరరావు ఉదంతానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది. తన ఫామ్ హౌస్ లోని వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పనుల్ని చూసుకునేందుకు పెట్టుకున్న వ్యక్తి భార్యపై తాను అత్యాచారం చేశారని.. ఆ విషయం బయటపెడితే చంపేస్తానంటూ రివాల్వర్ తో బెదిరించిన వైనాన్ని అంగీకరించినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు తాను చేసిన దారుణ నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్టులో ఉంది. అంతేకాదు.. లైంగిక దాడి అనంతరం.. ఆధారాల్ని మాయం చేసేందుకు తన దుస్తుల్ని తాను ఉతుక్కొన్న వైనాన్ని వివరించారు.
సీఐ చెప్పిన వివరాలతో కూడిన రిమాండ్ రిపోర్టును వనస్థలిపురం పోలీసులు కోర్టుకు అందజేశారు. అత్యాచార ఆరోపణలతో ఈ నెల 7న బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. నాగేశ్వరరావును 11న అరెస్టు చేశారు. అనంతరం అతన్ని చర్లపల్లి జైలుకు రిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన నివేదికలో పలు అంశాల్ని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బెదిరింపు.. అత్యాచార కేసులో అరెస్టు అయిన సీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని నాగేశ్వరరావుకు జైలులో అందజేసినట్లు చెబుతున్నారు. ఇక..రిమాండ్ రిపోర్టులో నాగేశ్వరరావు వెల్లడించిన అంశాల్ని చూస్తే..
– నాలుగేళ్ల క్రితం ఉత్తర మండలం టాస్క్ ఫోర్సు ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న సమయంలో బాధితురాలి భర్తపై క్రెడిట్ కార్డుల్ని సేకరించి మోసం చేశాడన్న ఆరోపణలతో బేగంపేట.. మహంకాళి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపా. ఆ సమయంలో బాధితురాలు టాస్కు ఫోర్సు కార్యాలయానికి వచ్చింది. పుట్టగొడుగుల పెంపకంలో భారీగా నష్టాలు వచ్చాయని చెప్పింది. దీంతో వెలిమినేడులోని నా ఫామ్ హౌస్ లో పుట్టగొడుగుల్ని పెంచాలని.. కాపలాదారుగా ఉద్యోగం ఇస్తానని చెప్పా.
– ఆమె భర్త బెయిల్ పై బయటకు వచ్చాక ఫామ్ హౌస్ లో నియమించుకున్నా. ఫామ్ హౌస్ కు తరచూ వెళ్లి ఆమెతో మాట్లాడేవాడ్ని. ఆమె పిల్లల పుట్టిన రోజు వేడుకులకు వెళ్లినప్పుడు బహుమతులు ఇచ్చేవాడిని. గత ఏడాది ఫిబ్రవరిలో నా కోరిక తీర్చుకోవటానికి ఆమెను కారులో తీసుకెళ్లి ఫామ్ హౌస్ సమీపంలోని నా స్నేహితురాలి ఇంట్లో దించినప్పుడు.. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి సమాచారాన్ని ఇచ్చింది. అతడు నాకు ఫోన్ చేసి మా ఇంట్లో వారికి చెబుతానని చెప్పటంతో సారీ చెప్పి.. నా తప్పును బయటపెట్టొద్దని వేడుకున్నా.
– ఈ నెల 7న ఆమె భర్త ఊళ్లో లేడని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డా. తర్వాత బాధితురాలిని.. ఆమె భర్తను వారి సొంతూరు వద్ద వదిలి వెళ్లేందుకు కారులో తీసుకెళ్లా. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ లోపు గస్తీ టీం రాగా.. ఆక్టోపస్ అధికారినని అబద్ధం చెప్పా. కొత్తపేటలోని ఇంటికి వెళ్లి చిరిగిన దుస్తులపై ఆధారాలు లభించకుండా ఉండేందుకు సొంతంగా ఉతుక్కొని దాచి పెట్టా.
– కేసు నమోదైన విషయం తెలుసుకొని.. అరెస్టు చేస్తారని ఊహించి బెంగళూరుకు పారిపోయా. తర్వాత హైదరాబాద్ కు వచ్చా.
Comments 1