ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లింగ్ మెషీన్ అని అర్థం. కానీ, మన దేశంలో ప్రజలు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ ఇచ్చే మెషీన్ అని భావిస్తుంటారు. వాస్తవానికి కూడా ఏటీఎం చేయాల్సిన పని కూడా అదే. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఏ టైంలో నైనా మనీ విత్ డ్రా చేసుకోగలగడమే ఏటీఎం ప్రధాన ఉద్దేశం. కానీ, మన దేశంలోని చాలా ఏటీఎంలు నిత్యం నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తుంటాయి.
నోట్ల రద్దు సమయంలోనైతే ఈ బోర్డులు మరింత ఎక్కువగా దర్శనమిచ్చేవి. ఆ సమయంలో ఏటీఎంల ముందు గంటలకొద్దీ పడిగాపులు కాసినా….డబ్బులు వస్తాయన్న గ్యారెంటీ ఉండేది కాదు. ఇప్పటికీ, దేశంలోని చాలా ఏటీఎంలు సరిగ్గా క్యాష్ మెయింటెన్ చేయడం లేదని, ఎప్పుడు చూసినా కొన్ని ఏటీఎంల ముందు సర్వర్లు పనిచేయడం లేదనో, నో క్యాష్ అనో బోర్డుల పెట్టే ఉంటాయని వినియోగదారులు వాపోతున్నారు. అటువంటి సమయాల్లో ఖాతాదారుల మెదళ్లను ఓ ప్రశ్న తొలిచేస్తుంటుంది.
తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ముక్కుపిండి ఫైన్ వసూలు చేస్తున్నాయి. కానీ, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డు పెడితే…ఆ బ్యాంకుకు ఫైన్ ఎందుకు వేయరు? బహుశా ఖాతాదారుల గోడును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విన్నట్లుంది. అందుకే, తాజాగా ఏటీఎంలలో నగదు కొరతపై ఆర్బీఐ తీవ్రంగా స్పందించింది. ఏటీఎంలో నగదు లేకపోతే ఆ బ్యాంక్‌కు రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తామని ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. బ్యాంక్ ఖాతాదారులకు ఖాళీ ఏటీఎంలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నందున ఆర్బీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఏటీఎంల్లో ఎప్పటికప్పుడు నగదును నింపాల్సిందేనని, లేకుంటే ఫైన్ గా ఫైన్ వేస్తామని ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చింది.
‘ఒక నెల మొత్తంలో 10 గంటలకు పైగా ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే ఆ ఏటీఎంకు రూ.10,000 జరిమానా విధిస్తాం. ఇలా ఎన్ని ఏటీఎంలు ఖాళీగా ఉంటే రూ.10,000 చొప్పున అన్ని జరిమానాలు తప్పవు’ అని ఆర్బీఐ తన తాజా సర్క్యులర్ లో స్పష్టంగా పేర్కొంది. ఏటీఎంల ద్వారా ప్రజలకు నగదు సకాలంలో సక్రమంగా అందాలని, అందుకు సరిపడా నగదును వాటిలో ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదేనని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికే ఖాళీ ఏటీఎంలపై ఈ జరిమానాలను విధిస్తున్నామని తెలిపింది.