ఫేస్ బుక్ అంటే..తెలుగులో ముఖ పుస్తకం అని సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా అంటుంటారు. నిజజీవితంలో కనీసం ముఖ పరిచయం లేని ఎంతోమంది వ్యక్తులు ఈ ముఖ పుస్తకంలో స్నేహితులుగా మారుతుంటారు. వయోభేదం, లింగ బేధం లేకుండా తమ ముక్కూమొహం తెలియని వారు తమ అభిప్రాయాలను, ఆలోచనలను, అభిరుచులను, ఆకాంక్షలను, మనసులో మాటలను నిర్భయంగా, స్వేచ్ఛగా ఫేస్ బుక్ వేదికగా షేర్ చేస్తుంటారు. ఇక, విమర్శకులకు, అర్థవంతమైన, అర్థరహిత, వితండవాదాలకూ ఈ ఫేస్ బుక్కే కిక్కునిస్తుంది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. కొంతమందికి అయితే ఫేస్బుక్ తోనే రోజు మొదలై ఫేస్బుక్ తోనే రోజు ముగుస్తుంది. ఆ రకంగా చాలామంది జీవితాలలో ఒక భాగం అయిపోయిన ఫేస్బుక్ 2 రోజుల క్రితం 2 గంటల పాటు మొరాయించింది. దాదాపు ఒక రోజుపాటు చాలామంది యూజర్లు తమ ఖాతాలో లాగిన్ అయ్యేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే ముఖపుస్తక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దీంతో అనంత్ అంబానీ పెళ్లి కోసం జుకర్ బర్గ్ ఇండియాకు వచ్చాడని, ఆయన డిన్నర్ చేస్తున్న 2 గంటల గ్యాప్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్రాష్ అయ్యాయని నెటిజన్లు మీమ్స్, సెటైర్లు వేస్తున్నారు.
ఇక, అనంత్ అంబానీ తన ఫేస్బుక్ పాస్వర్డ్ మర్చిపోయాడని, అందుకే జుకర్ మామను తన పెళ్లికి ఆహ్వానించి విందు భోజనం పెట్టి మరి పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాడని మీమ్స్ వైరల్ అయ్యాయి. అయితే, సరదాగా ఇటువంటి మీమ్స్ చూసి జుకర్ బర్గ్ నవ్వుకున్నప్పటికీ…ఒకరోజు పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్తంభించిపోయినందుకు వాటి మాతృ సంస్థ మెటా నష్టపోయిన మొత్తం చూస్తే మాత్రం కచ్చితంగా ఏడుస్తాడు. ఎందుకంటే ఒక రోజు పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, త్రెడ్స్, మెసెంజర్ సేవలు నిలిచిపోయినందుకు ఒక్క రోజులో జుక్కు మామ దాదాపు పాతిక వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
అంటే, ఒక రోజులోనే జుకర్ బర్గ్ దాదాపు 3 బిలియన్లు నష్టపోయాడు. అంతేకాదు జుకర్ బర్గ్ నికర విలువ 2.79 బిలియన్ డాలర్లు తగ్గి బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ లో ఆయన సంపద 176 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినా సరే ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల జాబితాలో మాత్రం నాలుగో స్థానాన్ని జుక్కు మామ నిలబెట్టుకున్నాడుజ మెటా షేర్లలో 1.6% తగ్గుదల కనిపించడంతో నికర విలువలో కూడా కోత పడింది. వాస్తవానికి మంగళవారం రాత్రి 8:30 నుంచి 10:30 వరకు అంటే రెండు గంటల పాటు మాత్రమే మెటా పూర్తిగా క్రాష్ అయింది.
కానీ, యూజర్లు తమ లాగిన్ రీసెట్ చేసుకోవడానికి ఒక రోజు పట్టింది. రెండు గంటలు, ఒక రోజుకే ఇలా అయితే రెండు మూడు రోజులపాటు మెటా క్రాష్ అయితే జుకర్ బర్గ్ దాదాపు లక్ష కోట్లు నష్టపోయే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అంబానీ..జుకర్ బర్గ్ కు ఇచ్చిన డిన్నర్ చాలా కాస్ట్లీ గురూ…ఒక డిన్నర్ ఖరీదు పాతిక వేల కోట్లు అంటూ నెటిజన్లు మీమ్స్ తో రెచ్చి పోతున్నారు.