అవును.. మీరు చదివింది కరెక్టే. విమాన ప్రయాణ వేళ.. మీరు ఉత్త హ్యాండ్ బ్యాగేజ్ తప్పించి.. మరెలాంటి లగేజ్ లేకుండా మీ ప్రయాణ ఖర్చు తగ్గే వీలుంది. ఎలంటి లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో ప్రయాణించే ప్రయాణికులకు సరికొత్త రాయితీ ఇచ్చేందుకు వీలుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సరికొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
దీని ప్రకారం కేవలం క్యాబిన్ బ్యాగేజీ మాత్రమే వెంట తీసుకెళ్లే వారికి టికెట్ ధరలో వెసులుబాటు కల్పించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు ఏడు కేజీల వరకు క్యాబిన్ బ్యాగేజీ.. పదిహేను కేజీల వరకు చెక్ ఇన్ లగేజ్ ను తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ బరువు వెంట తీసుకెళితే.. లగేజ్ కు అదనంగా ఛార్జ్ చేస్తున్నారు.తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వెంట లగేజ్ లేకుండా.. కేవలం క్యాబిన్ బ్యాగేజీతో ప్రయాణం చేసే ఆలోచన ఉంటే.. అలాంటి వారు తాము టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే రాయితీ పొందేలా నిర్ణయం తీసుకున్నారు.
జీరో బ్యాగేజ్.. నో చెక్ ఇన్ బ్యాగేజ్ ధరల స్కీంను అందించేందుకు విమాన సంస్థలకు అనుమతిని విమానయాన శాఖ తాజాగా ఇచ్చింది. దీంతో.. లగేజ్ లేకుండా టికెట్ బుక్ చేసుకునే వారికి.. రాయితీ అవకాశాన్ని విమానయాన సంస్థలు కల్పించే వెసులుబాటు కలుగుతుంది. సో.. ఈసారి నుంచి టికెట్ కొనుగోలు చేసే సమయంలో.. లగేజ్ లేకుండా రాయితీ సౌకర్యాన్ని పొందటం మర్చిపోకండి.