విషయం ఏదైనా వివరాలు వెల్లడించే కొద్దీ.. అనవసరమైన ఇబ్బందులకు కారణం అవుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. శిక్షణ పొందిన కీలక అధికారులు ఎవరినైనా తీసుకోండి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో వీలైనంత తక్కువ మాట్లాడతారు. అలా అని వారి దగ్గర విషయం లేదని కాదు. క్లుప్తంగా మాట్లాడాల్సిన వేళలో.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎదురయ్యే చిక్కులు మామూలుగా ఉండవు. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తీరు ఇలానే ఉంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన వేళలోనే.. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్ స్వామి అనే స్వామిజీ కమ్ లాబీయిస్టుగా పేరున్న వ్యక్తి ప్రత్యేక విమానంలో మైసూర్ నుంచి గన్నవరం రావటం.. తాడేపల్లిలోని సీఎం ఇంటికి వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ భేటీకి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు సంచలన కథనాల్ని అందించాయి. దీనిపై స్పందించిన సుబ్బారెడ్డి అంతకు మించిన సంచలనంగా మారారు. విజయ్ కుమార్ ను తానే తీసుకొచ్చానని.. ఆయన మహిమలు ఉన్న స్వామీజీగా పేర్కొంటూ.. సీఎంకు అశీర్వాదం ఇప్పించేందుకు తాను పంపినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు విజయ్ వచ్చిన ప్రత్యేక విమానం ఎవరిదో తెలుసా? అంటూ రామోజీ వియ్యంకుడి పేరును సీన్లోకి తీసుకొచ్చారు. రామోజీ పేరును ప్రస్తావించినంతనే తమకు సానుకూలత పెరిగి.. తమను తప్పు పడుతున్న వారికి నెగిటివ్ గా మారుతుందని సుబ్బారెడ్డి భావించినట్లుగా కనిపిస్తోంది.
కానీ.. తన మాటల కారణంగా లేనిపోని తలనొప్పుల్ని తాను తీసుకొచ్చిన విషయాన్ని సుబ్బారెడ్డి ఎప్పటికి గుర్తిస్తారో? తాను చెప్పిన మాటల కారణంగా కొత్త ప్రశ్నలు తెర మీదకురావటమే కాదు.. వాటికి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అయ్యారన్నది ప్రశ్నగా మారింది. సీఎం జగన్ కు విజయ్ స్వామి ఆశీర్వచం చేయాలని తాను పంపినట్లుగా సుబ్బారెడ్డి చెప్పిన వేళ.. ఒకవేళ స్వామీజీ వచ్చింది ఆశీర్వచనం చేయటానికే అయితే.. ఆరు గంటల పాటు ఆశీర్వచనం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రామోజీని ఇరుకున పడేసేలా తాను మాట్లాడుతున్నట్లుగా భావించి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా.. రామోజీ కంటే తనకే ఎక్కువ నష్టమన్న విషయాన్ని సుబ్బారెడ్డి ఎలా మిస్ అయ్యారన్న విస్మయం వ్యక్తమవుతోంది. జగన్ మీద సబ్బారెడ్డికి ఎంత అభిమానమో తెలియంది కాదు. కానీ.. ఆవేశంతో చేసే పనుల కారణంగా తాను అభిమానించే అధినాయకుడికి కష్టం ఎదురవుతుందన్న విషయాన్ని ఆయన త్వరగా గ్రహిస్తే మంచిది. తాజా ఎపిసోడ్ లో బుక్ చేద్దామనుకొని.. బుక్ అయిన పద్దతి సరికాదంటున్నారు.