గతంలో మాదిరి పరిస్థితులు ఇప్పుడు లేవు. యాభై ఏళ్ల క్రితం కొన్ని పదాల్ని ఇట్టే వాడేసినా పట్టించుకునే వారు ఉండేవారు కాదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రతి విషయం సున్నితంగా మారింది.
ప్రతి ఒక్కదానికి మనోభావాలు లాంటి అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఎలాంటి దురుద్దేశం లేకున్నా.. నోరు జారితే చాలు.. ఇట్టే ఇరుక్కుపోయే పరిస్థితి. ఇదే ఇప్పుడు సెలబ్రిటీలకు కొత్త సమస్యగా మారింది.
తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కోవటమే కాదు.. వ్యవహారం అరెస్టు వరకు వెళ్లింది. ప్రముఖులు మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం యువరాజ్ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
తన తోటి క్రికెటర్ తో లైవ్ లో మాట్లాడే వేళలో.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనంగానూ.. పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేసేలా చేసింది. చివరకు ఈ వ్యవహారం అరెస్టు వరకు వెళ్లటం గమనార్హం. ఇంతకీ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. గత ఏడాది జూన్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఒక లైవ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. మాటల సందర్భంలో తోటి క్రికెటర్ చహల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడి సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తాను చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం వివాదాస్పదం అయిన వెంటనే ఆయన స్పందించారు.
తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని.. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని.. ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా.. తాను క్షంతవ్యుడ్ని అంటూ పేర్కొన్నారు. కానీ.. ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకున్న ఒక లాయర్ హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసుల్ని ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు.
లాక్డౌన్ అనంతరం ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన హిస్సార్ పోలీసులు యువరాజ్ పై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టు అయిన కాసేపటికే ఆయన్ను బెయిల్ మీద విడుదల చేశారు. సో.. ఈ ఎపిసోడ్ తో అర్థమయ్యేదేమంటే.. నోటికి వచ్చినట్లు మాట్లాడేసి.. ‘సారీ’ అన్న మాటలు వర్కువుట్ కాదన్న విషయాన్ని ప్రముఖులు గుర్తిస్తే చాలా మంచిది.