తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పీకేసే సమయం వచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల సంసిద్ధత వ్యక్తం చేశారని టాక్. అందుకు ఆగస్టు 12న ముహూర్తం పెట్టుకున్నారని తెలిసింది. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి అన్ని చర్చలు పూర్తయ్యాయని తెలిసింది.
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలనే ఉద్దేశంతో 2021 జులై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. తానే అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని ఆరంభంలో పరుగులు పెట్టించారు. నాయకుల చేరికలు, పాదయాత్ర, ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వంపై విమర్శలు.. ఇలా ప్రారంభంలో అంతా బాగానే సాగింది. కానీ ఆ తర్వాతే తేడా కొట్టింది. ఎంత చేసినా ప్రజల్లోకి పార్టీ వెళ్లలేకపోయింది. మరోవైపు కీలక నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి వెళ్లిపోయారు.
పార్టీని నడపడంలో లాభం లేదని భావించిన షర్మిల చివరకు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్దికాలంగా ఈ ప్రచారం ఊపందుకుంది. నిజానికి జులై 18నే ఈ విలీన ప్రక్రియ పూర్తికావాల్సిందని అంటున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు పూర్తికాలేదని సమాచారం. ఇప్పుడు చర్చలు పూర్తికావడంతో విలీనానికి రూట్ క్లియర్ అయిందని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌తో ఎలాగో ఈ పని జరగదని భావించిన షర్మిల.. బెంగళూరులో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఈ విలీనం వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
పార్టీని విలీనం చేస్తున్న షర్మిల.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నుంచి పోటీ చేస్తారని తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఒకవేళ పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఓడిపోయినా.. కాంగ్రెస్‌లో సుదీర్ఘ భవిష్యత్‌పై షర్మిల ఆశాభావంతో ఉన్నట్లు తెలిసింది.