రాజన్న రాజ్యం స్తాపిస్తానంటూ.. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, దివంగత వైఎస్ తనయ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పార్టీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో.. హైదరాబాద్ లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకొన్నారు. పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా షర్మిల కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నేతలు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. సంబరాల్లో బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా పాల్గొన్నారు. వైఎస్ షర్మిల గత ఏడాది వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకుడంటే ప్రజలతో మమేకమై నడవాలని..తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని అప్పట్లో వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్కు ఎవరిపైనా వివక్ష లేదని చెప్పారు. వైఎస్ షర్మిలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసమే షర్మిల రాజకీయ ప్రవేశం చేసిందన్నారు.
వైఎస్ఆర్ నాయకత్వాన్ని నిలబెడతానని, తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానని వైఎస్ షర్మిల చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. నాన్న మాటిస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని ఆమె తరచుగా చెబుతున్నారు.
శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ఆర్ అని కొనియాడుతున్నారు. ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారని ఇప్పటికీ.. ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగ సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు.
పాదయాత్ర కూడా ప్రారంభించారు. అయితే స్థానిక ఎన్నికల నేపథ్యంలో దీనిని ఆమె వాయిదా వేశారు. ఆరోగ్యశ్రీ పేరుతో నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారముండగానే..ఫాంహౌస్లు చక్కబెట్టుకుంటున్నారని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.
తన పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. చట్టసభల్లో సగం సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. అయితే.. పార్టీ పుంజుకునే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం గమనార్హం.