ఏపీలో అధికార వైసీపీకి అత్యంత బలీయమైన శక్తి అబద్ధాలను నిజాలుగా వల్లిస్తూ అరాచకంగా వ్యవహరించే ఆ పార్టీ సోషల్ మీడియానే. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయపార్టీల్లోకెల్ల అత్యంత బలమైన పెయిడ్ సోషల్ నెట్వర్క్ ఆ వైసీపీదే.
ఒకరకంగా వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు సోషల్ మీడియా నెట్వర్క్, సోషల్ మీడియా టీం కుడిభుజం అని చెప్పాలి. అలాంటి కుడి భుజానికి శుక్రవారం రాత్రి నుంచీ అనూహ్యంగా హ్యాకర్ల నుంచీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సామాజిక మధ్యమాలు చాలా బలమైనవి. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా సామాజిక మాధ్యమ వేదికలపైన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతమైంది కూడా. లక్షలాది మంది ఫాలోవర్లు ఆ పార్టీ సోషల్ మీడియా ఖాతాలకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి అత్యంత కీలకమైన ట్విట్టర్ ఖాతాపై హ్యాకర్లు దాడి చేయడం సంచలనంగా మారింది.
శుక్రవారం రాత్రి 8.18 నిమిషాల తరువాత ట్విట్టర్ ఖాతా స్తంభించిపోయింది. జీ-20 సన్నాహక సదస్సుపైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వై.ఎస్.జగన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పోస్టు మాత్రమే చివరిది. ఆ తరువాత వైసీపీ అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఎలాంటి పోస్టులు నిపించలేదు. హ్యాకర్లు ఈ ఖాతాపై దాడి చేసి హ్యాక్ చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
తమ పార్టీ ట్విట్టర్ ఖాతాను రికవరీ చేయడానికి ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తామని పేర్కొంది. వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం ట్విట్టర్ ఖాతాను మళ్లీ రికవరీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యానికి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది.
వైసీపీ ట్విట్టర్ ఖాతా ఇప్పుడు హ్యాకర్లకు ఎందుకు టార్గెట్ అయిందనేది చర్చనీయాంశంగా మారింది. లక్షలాది మంది ఫాలోవర్లు దీనికి ఉండటంతో హ్యాకర్ల కన్ను దీనిపైన పడిందని భావిస్తున్నారు.
YSRCP account hacked pic.twitter.com/WRk8iKErHl
— Barbarik (@barbaarik) December 10, 2022