వైఎస్సార్సీపీకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలలో జరిగే ప్లీనరీలు, మరియు జిల్లా స్థాయిలో జరిగే ప్లీనరీలు.. వివాదాలకు తావిస్తున్నాయి. రెండేళ్ల తరువాత ఎన్నడూ లేని విధంగా మినీ మహానాడు, మహానాడు మాదిరిగా ఇక్కడ కూడా ఇలాంటివే జరుగుతున్నాయి.
ఓ విధంగా పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిలో భాగం ఇదంతా అని జగన్ వర్గం అంటోంది. కానీ ఆ మాట ఆచరణలోకి రావడం లేదు. పార్టీ బలోపేతం మాట ఏమో కానీ వివాదాల సుడి మాత్రం తిరుగుతూనే ఉంది. వివాదాల కారణంగానే తరుచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
వైసీపీని అడ్డుకునే వారే లేరు అని కొడాలి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా, అదే మాట మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు అంటున్నా అవన్నీ పై పై మాటలే అని విపక్షం అంటోంది. గెలిచేది తామే అని, అవి కేవలం డాంబికాలు మాత్రమే అని పెదవి విరుస్తోంది.
మరోవైపు వైసీపీ నాయకుల వాదం మాత్రమే విభిన్నంగానే ఉంది. బొత్స లాంటి నాయకులు పార్టీలో ఉన్న నాయకులకూ, కార్యకర్తలకూ రెండో ఆలోచన రాకూడదని, వస్తే పార్టీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోవడం ఖాయం అని జోస్యం చెబుతున్నారు.
జోగి రమేశ్ అనే మంత్రి మరో అడుగు ముందుకు వేసి వెల్లంపల్లి (మాజీ మంత్రి) ఇక్కడ ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. అదేవిధంగా నేను కానీ ఎవరు కానీ పార్టీలో ఉన్నా ఉండకపోయినా కార్యకర్తలే కీలకం అని అంటున్నారు. ఈ మాటలు వైసీపీ పెద్దాయన, మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఎదుట అన్నారాయన.
ఇవి కూడా చర్చకు తావిస్తున్నాయి. ఒకరేమో (కొడాలి నాని) అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించుకుంటూ పోతున్నారు .. మరొకరేమో ఇక్కడెవ్వరూ ఉండరని కూడా అంటున్నారు. మరి! పార్టీలో ఇన్ని డీవిషేయన్లు ఉంటే గెలుపు ఎలా సాధ్యం అనుకోవాలి అని అంటున్నారు పరిశీలకులు.