ఇప్పటి వరకు విశాఖ పట్నం జిల్లాకే పరిమితమైన వైసీపీ హాట్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రశాంతమైన శ్రీకాకుళం జిల్లాను కూడా తాకాయని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ పార్టీ విభేదాలు రోజుకోరకంగా మలుపు తిరుగుతున్నాయి. వీటిని సరిదిద్దే బాధ్యతను సీఎం జగన్ ఎవరికీ ఇవ్వలేదు. దీంతో ఇద్దరు కీలక నేతలు నేను సరిదిద్దుతానంటే.. నేనే సరిచేస్తానంటూ.. పోటీ పడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న విభేదాలు యూటర్న్ తీసుకుని.. వీరిద్దరి కేంద్రంగా రాజకీయాలు హల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. శ్రీకాకుళంలో వైసీపీకి కీలకంగా ఇద్దరు నేతలు ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్.
వీరిద్దరూ ఒకప్పుడు మిత్రులే. అయితే.. గత ఎన్నికల్లో ఇద్దరూ టెక్కలి సీటు కోసం పోటీ పడి విభేదించుకున్నారు. ఈ క్రమంలో బలాబలాలను అంచనా వేసుకున్న పార్టీ.. టెక్కలికి పేరాడను ఉంచి.. శ్రీకాకుళానికి దువ్వాడను కేటాయించింది. అయితే.. టీడీపీ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడుల దూకుడుతో ఇద్దరూ ఓడిపోయారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ హవా బాగానే సాగింది. టీడీపీ కంచుకోటల్లో సైతం పార్టీ విజయం సాధించింది. అయితే, ఈ రెండు చోట్లా ఓడిపోయింది. ఇక, అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత కాస్తా.. మరింత వివాదాలకు దారితీసింది. నా ఓటమి నువ్వే కారణమంటూ.. పేరాడ తిలక్ దువ్వాడపై ప్రత్యక్ష పోరాటానికి తెరదీశారు.
ఇక, కేంద్రంలో మంత్రిగా చేసిన నాయకురాలు కిల్లి కృపారాణికి జిల్లా పగ్గాలు అప్పగించారు. ఈమె వీరిద్దరికి సయోధ్య చేయాల్సింది పోయి.. పేరాడ వైపు మొగ్గారు. ఆయనకు అనుకూలంగా దువ్వాడకు వ్యతిరేకంగా చక్రం తిప్పడం ప్రారంభించారు. దీంతో మరింతగా విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇదే జిల్లా నుంచి డిప్యూటీ సీఎం అయిన ధర్మాన కృష్ణదాస్ రంగంలోకి దిగి.. నేను సరిదిద్దుతానంటూ.. అందరినీ పిలిచి మాట్లాడారు. ఈ క్రమంలోనేపేరాడకు కళింగ సామాజిక వర్గం కార్పొరేషన్ చైర్మన్ గిరీ ఇప్పించారు. ఇది మరింతగా వివాదానికి కారణమైంది. దువ్వాడ ఈ వ్యవహారంపై కినుక వహించారు.
తానేం పాపం చేశానని ప్రశ్నించారు. మొత్తంగా ఈ విషయం ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహార ఇంచార్జ్ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నేరుగా రంగంలోకి దిగిపోయారు. దీంతో ఉప ముఖ్యమంత్రి ధర్మాననకు, సాయిరెడ్డికి మధ్య అగాధం ఏర్పడింది. నా జిల్లాలోకి నన్ను సంప్రదించకుండా పంచాయతీ చేసేందుకు వస్తావా? అంటూ.. ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ ఇద్దరి సమస్యల్లా ఇప్పుడు యూటర్న్ తీసుకుని కీలక నేతల సమస్యగా మారడంతో మరింతగా వివాదం పెరిగిపోయింది. ఇప్పుడు ఈ పంచాయతీ జగన్ వద్దకు చేరిందనిచెబుతున్నారు. మరి ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. ఏదేమైనా టీడీపీ పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో వైసీపీ కుమ్ములాటలు ఆ పార్టీకి లాభిస్తుండడం గమనార్హం.