ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) (వైసీపీ) నిజంగానే పెను ప్రమాదంలో పడిందా? అనే వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ పార్టీ గుర్తింపు రద్దు కానుందన్న వార్తలు నిజంగానే వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపేవేనని చెప్పాలి.
ఎందుకంటే… బుధవారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు… తీర్పును ఈ నెల 17కు వాయిదా వేసింది. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢి్ల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ బుధవారం సుదీర్ఘంగానే సాగింది. అటు పిటిషనర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి తరఫు న్యాయవాదితో పాటు ఇటు వైసీపీ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలను వినిపించారు.
ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు… వాదనలు ముగిసినట్టేనని ప్రకటించడంతో పాటుగా తీర్పును ఈ నెల 17న వెలువరించనున్నట్లుగా వెల్లడించింది. వెరసి ఈ నెల 17న వైసీపీకి పెను గండం పొంచి ఉందని చెప్పక తప్పదు.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే… జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి కలకలం రేపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట వైసీపీ కంటే ముందే తాము ఓ రాజకీయ పార్టీని రిజిష్టర్ చేసుకున్నామని ఆయన సదరు పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే తాము పార్టీ పెట్టుకున్న తర్వాత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరిట జగన్ మరో పార్టీని రిజిష్టర్ చేసుకున్నారని, అయితే ఆ పూర్తి పేరును పక్కనపడేసి… వైఎస్సార్సీపీ అంటూ తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జగన్ వర్గం అనుసరిస్తున్న వైఖరితో తమ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీకి నష్టం కలిగిస్తున్న వైసీపీని నిలువరించాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాకుండా వైసీపీ గుర్తింపును కూడా రద్దు చేయాల్సిందేనని ఆయన కోర్టుకు విన్నవించారు.
ఈ పిటిషన్ పై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ సాగగా… బుధవారం ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. సీఎం జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… వైఎస్సార్ పేరును వాడకుండా చూడాలని, వైసీపీ ని రద్దు చేసి వైయస్సార్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు .
లెటర్ హెడ్ పోస్టర్లు బ్యానర్లు లో ఉపయోగించే పేరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నికల సంఘం వైయస్సార్ అనే పేరును తమకు కేటాయించిందని , దానిని ఇతరులు వినియోగించడానికి వీల్లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
తమకు కేటాయించిన పేరును వైసీపీ వాడుకోవటం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు . ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.