ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇషాక్ భాషతో పాటు, కడప జిల్లా నుంచి డీసీ గోవిందరెడ్డికి అవకాశం ఇచ్చారు. రెండు రోజుల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి తిరిగి అవకాశం ఇచ్చారు. ఆయన ఈ ఏడాదిలోనే పదవీ విరమణ చేశారు. గోవిందరెడ్డి ఎంపికతో రెడ్డి సామాజిక వర్గానికి చోటు కల్పించినట్లయింది. మరొక అభ్యర్థి విక్రాంత్, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మూడో అభ్యర్థిగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్ భాషాకు అవకాశం ఇచ్చారు. ఆయన నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు.
గతంలో నంద్యాలకు చెందిన వారికి మండలిలో చోటు కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు, ఈ నేపథ్యంలోనే ఇషాక్ భాషకు అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. మరో 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను భర్తీ జరగాల్సి ఉందని, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నామని, రెండు రోజుల్లో ప్రకటిస్తామని సజ్జల తెలిపారు.
ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ప్రతి పదవిలో అటు నామినేటెడ్, ఇతర పదవుల్లో 50 శాతం స్థానాలను ఎస్పీ, ఎస్టీ, బీసీ, ముస్లిం సామాజిక వర్గాలకు కేటాయిస్తూ వస్తోంది.
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబరు 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి స్థానాలకు, చిత్తూరు, ప్రకాశం తూర్పుగోదావరి, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. స్థానిక సంస్థల స్థానాల్లో అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లను ఈ నెల 23 వరకు స్వీకరిస్తారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వరకు గడువు విధించారు. పోలింగ్ డిసెంబరు 10న నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కూడా సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 16న నామినేషన్లు స్వీకరిస్తారు.