ఏపీ అధికార పార్టీ వైసీపీ కి కీలకమైన ఎన్నికల ముందు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పార్టీకి దూరంగా ఉన్నారు. తాడికొండ ఎస్సీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గత ఏడాది నుంచే రెబల్‌గా ఉండి.. పార్టీకి దూరమయ్యారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎస్సీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా .. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీ చెంతకు చేరిపోయారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాత(పీ) గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం వైసీపీని వీడారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత, సీఎం జగన్‌కు ఆయన ఫ్యాక్స్‌లో రాజీనామాను పంపించారు. అంతేకాదు.. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటనలో ఉన్నారు.
కడపలోని ముద్దనూరు ప్రాంతంలో ఆమె రోడ్‌షో చేస్తున్నారు. నేరుగా చిట్టిబాబు అక్కడకు చేరుకుని.. ఆమె సమక్షంలో కండువాకప్పుకొన్నారు. కాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పి.గన్నవరం నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో ఇది లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిట్టిబాబు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. కూటమిలో భాగంగా ఇక్కడ నుంచి జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక, వైసీపీ తరఫున విప్పర్తి వేణుగోపాల్ బరిలోఉన్నారు.