ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. ఇకపై గడుస్తున్న ప్రతి రోజూ వైసీపీకి అగ్నిపరీక్షే అన్నట్టు లెక్క. మరో యేడాదిన్నర మాత్రమే ఆ పార్టీకి గరిష్టంగా టైం ఉంది. చివరి యేడాది అంతా ఎన్నికల సంవత్సరమే. జగన్ ఇప్పటికే ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. వాటిల్లో సంక్షేమం తప్పా ఏ ఒక్క పని పూర్తవ్వలేదు.
పోలవరం అతీగతీ లేదు. రాజధాని ఊసే లేదు సరికదా… మూడు రాజధానుల వికేంద్రీకరణతో పలు ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అమరావతిని విభజించడం చాలా మందికి నచ్చలేదు. అసలు అభివృద్ధి అన్న ఊసే లేదు. రాష్ట్రంలో ఆ ప్రాంతం లేదు.. ఈ ప్రాంతం లేదు.. రహదారులు అన్నీ ఎక్కడికక్కడ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉద్యోగాల విషయంలో కూడా సచివాలయ ఉద్యోగాలు తప్పా మిగిలిన ఏ ఉద్యోగాలు ఈ రెండున్నరేళ్లలో భర్తీకాని పరిస్థితి.
కేవలం ప్రజల అక్కౌంట్లలో డబ్బులు వేసేసి ఇదే అభివృద్ధి అన్న చందంగా ఈ వైసీపీ ప్రభుత్వం పాలన ఉందన్న విమర్శుల అయితే వస్తున్నాయి. దీనికి తోడు జగన్ తీసుకుంటోన్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి, పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారాయి.
ఉదాహరణకు ఇటీవల చవితి వేడుకల విషయంలో కరోనాను సాకుగా చూపించడం.. షరా మామూలుగా మరోసారి హైకోర్టు చేతిలో మొట్టికాయలు వేయించుకోవడం లాంటి అంశాలు గత మూడు నెలల్లో జగన్ గ్రాఫ్‌ను మరింత దిగజార్చాయనడంలో సందేహం లేదు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అన్న పదాన్నే చాలా మంది మర్చిపోయారు.
జాతీయ సర్వేల్లో సైతం జగన్ గ్రాఫ్ ఇటీవల శరవేగంగా పతనమైనట్టే చెపుతున్నారు. మరి పార్టీ, ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉన్నా ఆ మేరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ బలపడిందా ? అంటే లేదనే అంటున్నారు. టీడీపీ వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ఏ మాత్రం క్యాష్ చేసుకోలేకపోతోంది.
అవినీతికి తోడు, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలపై ఉన్న భూదోపిడీలు, దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో కాని.. ప్రజల్లోకి వెళ్లడం కాని.. టీడీపీ వాళ్లు నిస్తేజంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రధానంగా టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేయడంతో పాటు వాళ్ల బిజినెస్‌లను, ఆస్తులను, లేదా ఇతర కేసులను ప్రధానంగా టార్గెట్‌గా చేసుకుంటోంది.
వీలైతే బెదిరించడం లేకపోతే కేసులు పెట్టేసి నిర్దాక్షిణ్యంగా జైలులో వేసేస్తోంది. వీటికి భయపడుతోన్న నేతలు ఎవ్వరూ బయటకు వచ్చి వైసీపీపై పోరాటం చేసేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు, లోకేష్ మినహా మిగిలిన నేతలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణాలతోనే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతున్నా ఆ మేరకు టీడీపీ గ్రాఫ్ అయితే పెరగడం లేదు.
ప్రజల్లో జగన్ పై పెరుగుతున్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడంలో తెలుగుదేశం విఫలమవుతోందన్నది అక్షర సత్యం.