రాష్ట్రంలో వైసీపీ సర్కారు పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది. సమూల మార్పులు.. సరికొత్త రాజకీ యాలు.. తీసుకువస్తామని.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. ప్రజల నుంచి ఓట్లు వేయించుకుని 151 సీట్లలో పాగా వేయడం ద్వారా సంచలన విజయం దక్కించుకున్న వైసీపీ.. మరి ఈ ఏడాదిన్నరలో చెప్పింది చెప్పినట్టు చేసిందా? అనే ప్రశ్న పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఏపార్టీకైనా.. ఎమ్మెల్యేలు అత్యంత కీలకం. మరి వారి పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల్లో పనులు చేస్తున్నారా? ప్రజలకు చేరువగా ఉంటున్నారా? అంటే.. దీనికి సమాధానం లభించడం లేదు.
వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 151 సీట్లలో దాదాపు 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు అచేతనంగా ఉన్నారని తాజాగా వైసీపీ సేకరించిన నివేదికే స్పష్టం చేస్తున్నట్టు ఆ పార్టీలోనే సీనియర్లు గుసగుసలాడుతున్నారు. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయని.. అభివృద్ధి ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యేలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు.. వలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత.. ప్రజలతో తమకు ఉన్న ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా కట్ అయ్యాయని.. ఇక, స్పందన కార్యక్రమం అమలుతో.. ఏదైనా సమస్య ఉంటే.. ప్రజలు నేరుగా అక్కడకే వెళ్తున్నారని.. అంటున్నారు. దీనిని వారు తప్పు పట్టకపోయినా.. ఎమ్మెల్యేలుగా తమకు విలువ లేకుండా పోయిందని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నియోజకవర్గం అభివృద్దికి నిధులు కేటాయించడమే లేదని ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు లబోదిబో మంటున్నారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లో సగం మంది.. ఆధిపత్య పోరును తట్టుకోలేక పోతున్నామని.. ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నామని.. అధికారులు సైతం.. మంత్రులు చెప్పినట్టే వ్యవహరిస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రకాశం, నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా గడప దాటి బయటకు రావడం లేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు.. ఓ 50 మంది ఫుల్లు దూకుడుగా ఉన్నా.. వ్యక్తిగత లబ్ధి, వ్యాపారాల విస్తరణలో మునిగి తేలుతున్నారని నివేదిక స్పష్టం చేసినట్టు వైసీపీలో హాట్ హాట్ చర్చ సాగుతుండడం గమనార్హం.