సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. అంటూ.. పల్లెటూర్లలో పాటలు పాడుకుంటూ.. పండగను ఎంజాయ్ చేయడం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ నేతలు కూడా ఇదే పాటను కొంత రివర్స్ చేసి పాడుకుంటున్నారు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. వసూళ్లు చేద్దామే తుమ్మెదా! అంటూ.. కొందరు అధికార పార్టీ నేతలు.. ఫోన్లపై ఫోన్లు చేసి.. ఫోన్లలోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు ప్రధాన జిల్లాల్లో .. ఈ దందా ఎక్కువగా సాగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
సాధారణంగా సంక్రాంతి అనగానే.. కొడిపందేలు.. గుర్తుకు వస్తాయి.
అయితే.. గత రెండేళ్లుగా.. సంక్రాంతి సంబరాల్లో సెక్స్‌వల్ డ్యాన్సులు, పేకాట శిబిరాలు.. పార్టీలకు కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది.
తాజాగా మొదలైన సంక్రాంతి సంబరాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పటికే హైకోర్టు నుంచి పోలీసులకు పడుతున్న మొట్టికాయల నేపథ్యంలో ముందు గానే అలెర్ట్ అయ్యారు.
ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ కోడిపందేల బరులు తొలగిస్తున్నారు. అదేవిధంగా కోడికాళ్లకు కత్తులు కట్టేవారిని ముందుగానే బైండోవర్ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ స్తబ్దుగా వాతావరణం మారిపోయింది.
అయితే.. కోడిపందేలు. పేకాటలకు కీలకమైన జిల్లాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు,ఉభయ గోదావరి జిల్లాలో మాత్రంఅత్యంత కీలకమైన వైసీపీ నాయకులు రంగంలోకి దిగిపోయారు. అంతా మేం చూసుకుంటాం.. మాకు ఇంత ఇవ్వండి! అని ఫోన్లలోనే బేరాలు చేస్తున్నట్టు వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అంతేకాదు.. బరుల బాధ్యత నుంచి అన్ని రకాల రక్షణ కల్పించేందుకు వారు హామీ ఇస్తున్నారు. వాస్తవా నికి ఏపీలో జరిగే కోళ్లపందేలకు హైదరాబాద్ సహా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు వస్తుంటారు.
దీంతో మందు, విందులకు రూ. కోట్లలోనే చేతులు మారుతున్నాయి. మరి పైకి మాత్రం పోలీసులు అడ్డుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కీలక నేతలు రంగంలోకి దిగి.. అంతా తామే అయి.. వీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.
మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.