సినీ పరిశ్రమ మీద ఆదాయపు పన్ను శాఖ వాళ్లు ఎప్పుడూ ఒక కన్నేసే ఉంచుతారు. వాళ్ల మీద దాడులు చేస్తే మీడియా పరంగా మంచి హైప్ వచ్చి ఐటీ వాళ్లు పని చేస్తున్నారు అనే భావన జనాలకు కలుగుతుంది. దీనికి తోడు ఫిలిం సెలబ్రెటీలను టార్గెట్ చేస్తే ఐటీ వాళ్లకు బాగా గిట్టుబాటు అవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. తాజాగా టాలీవుడ్లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు.. ఆ సంస్థతో కలిసి ప్రయాణం సాగిస్తున్న దర్శక నిర్మాత సుకుమార్ మీద ఐటీ వాళ్ల కళ్లు పడ్డాయి.
రెండు మూడు రోజుల పాటు వీరి ఆఫీసులు, ఇళ్ల మీద దాడులు జరిగాయి. ఐతే ఇలా ఐటీ ఎటాక్స్ జరిగినపుడు చాలా హడావుడి కనిపిస్తుంది కానీ.. చివరికి వ్యవహారం చల్లబడిపోతుంటుంది. ఏమైనా తేడాలుంటే జరిమానాలు విధించినట్లు, కఠిన చర్యలు చేపట్టినట్లు వార్తలేమీ కనిపించవు. ఈ వ్యవహారాలు ఎలా సద్దుమణుగుతాయన్నది ఆయా వర్గాలకు బాగానే తెలుసు.
మైత్రీ అధినేతలు, సుకుమార్‌లపై ఐటీ దాడుల వ్యవహారం కూడా మూణ్నాలుగు రోజులకే చల్లబడిపోయింది. రాబోయే రోజుల్లో ఏమైనా అనూహ్య పరిణామాలు జరుగుతాయేమో తెలియదు కానీ.. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇష్యూ దాదాపుగా క్లోజ్ అయినట్లే. కాగా ఐటీ దాడుల సందర్భంగా మైత్రీ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు పరిశీలించిన అధికారులకు కొన్ని సంచలన విషయాలు తెలిశాయట. ఆ సంస్థలో పెట్టుబడులన్నీ యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేనిల సొంతం కాదని.. పలువురు రాజకీయ నేతల డబ్బులను పెట్టుబడిగా పెట్టి వీరు సంస్థను నడిపిస్తున్నారని తేలిందట.
ఈ సంస్థలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ చెందిన పలువురు ఎమ్మెల్యేలు భారీగానే పెట్టుబడులు పెట్టారట. ఆ నంబర్ డబుల్ డిజిట్లో ఉన్నట్లు సమాచారం. ఈ డబ్బంతా బ్లాక్ మనీనే అయ్యుండొచ్చని భావిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా మైత్రీలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. కాబట్టే మైత్రీపై ఐటీ దాడుల వ్యవహారం సింపుల్‌గానే క్లోజ్ అయిపోతుందని అంటున్నారు.