వైసీపీ నేతల అసంతృప్తి కొనసాగుతోంది. బాపట్ల జిల్లా అద్దంకిలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ వైసీపీ నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పదవి ఆశించి భంగపడటంతో.. వాటర్ ట్యాంకు పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. పార్టీలో తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. ఎటువంటి కార్యక్రమాలకు పిలవడం లేదని, దళితుడిని అనే కారణంతోనే తనకు గుర్తింపు లేదని ఆరోపించారు.
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని వేలమూరిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జ్యోతి రోశయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. అయితే.. తనకు పదవి ఇస్తానన్న సీఎం జగన్ పలకకపోయే సరికి.. నిరాశ చెందారు. దీంతో రోశయ్య.. ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో మార్కెట్ యార్డులోని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి రోశయ్యని.. స్థానికుల సాయాంతో కిందకు దింపారు. అనంతరం అక్కడ నుంచి అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావటంతో.. రోశయ్య చైర్మన్ పదవి కోసం ఆశపడ్డాడు. అయితే అది దక్కదని తలచి.. తాను ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యాడు. స్థానిక వైసీపీ నేత కృష్ణ చైతన్య తనను పట్టించుకోవటం లేదని.. జగన్ మోహన్ రెడ్డి కూడా తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన పార్టీలో ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో చర్చకు దారితీసింది.