వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని నేడు ముంబైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానిని గత బుధవారం కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్న కొడాలి నాని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో కొడాలి ఆస్పత్రిలో చేరినప్పటికీ.. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్టంట్ లేదా బైపాస్ సర్జరీని సూచించారు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని నేడు ముంబైకి వెళ్లబోతున్నారట. గుండెలో మూడు వాల్వ్స్ బ్లాక్ అవ్వడంతో ముంబైలో ఆయనకు రేపు లేదా ఎల్లుండి బైపాస్ సర్జరీ జరగబోతుందట.
గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వంటి వారికి బైపాస్ సర్జరీ చేసిన డాక్టర్ పాండా కొడాలి నానికి కూడా సర్జరీ చేయనున్నారు. ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో సర్జరీ జరగనుంది. ఏఐజి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్న కొడాలి.. ఈ రోజు బైపాస్ సర్జరీ కోసం ముంబై వెళ్తున్నారట.