ఒకప్పుడు రాజకీయ పార్టీల మధ్య పోరాటం అంతా గ్రౌండ్ లెవెల్లోనే ఉండేది. మహా అయితే ప్రెస్ మీట్లు పెట్టి పరస్పరం విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మద్దతుదారుల పోరాటాలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు, వాద ప్రతివాదాలన్నీ మామూలే కానీ.. అంతకుమించి ఫేక్ ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక అవుతోంది.
తప్పుడు వార్తలు, ప్రచారాలను జనాలను ఒక భ్రమలో ఉంచి ప్రయోజనం పొందాలని చూసే పార్టీలు పెరిగిపోయాయి. దాదాపుగా ప్రతి పార్టీ ఎంతో కొంత ఫేక్ ప్రచారంతో సోషల్ మీడియా జనాలను తప్పుదోవ పట్టిస్తూనే ఉంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మిగతా పార్టీలన్నింటికంటే రెండాకులు ఎక్కువే చదివింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు అనేక విషయాల్లో వైసీపీ ఫేక్ ప్రచారం చేసింది. తర్వాత అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. అయినా సరే.. వారి తీరేం మారలేదు.
వైసీపీ సోషల్ మీడియా టీం.. ఆ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్.. అలాగే ఆ పార్టీ నేతల హ్యాండిల్స్ నుంచి పచ్చి అబద్ధపు ట్వీట్లు పడటం.. వాటి నిగ్గు తేలుస్తూ అసలు నిజాలను ప్రత్యర్థులు బయటపెట్టినా సరే.. ఆ ఫేక్ ట్వీట్లను డెలీట్ చేయకుండా అలాగే కొనసాగించడం.. ఇలాంటి ఉదంతాలు బోలెడున్నాయి. తాజాగా టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో భారీ ఎత్తున టిడ్కో ఇళ్ల సముదాయం నిర్మించారు. అప్పట్లో అవి ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమయ్యాయి. అంతలో ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. టీడీపీ కట్టిన ఇళ్లు కావడంతో వాటిని లబ్ధిదారులకు ఇస్తే క్రెడిట్ వాళ్లకు వెళ్లిపోతుందని జగన్ సర్కార్ వాటిని ఎంతకీ ప్రారంభించలేదు. చివరికి ఆ ఇళ్లకు వైసీపీ రంగులు వేసేశారు. ఎన్నికల ముంగిట వాటిని లబ్ధిదారులకు ఇచ్చి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
కాగా తాజాగా చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించి నారా లోకేష్ తరహాలోనే ఒక సెల్ఫీ తీసుకుని.. ట్వీట్ వేశారు. టీడీపీ హయాంలో ఇన్ని ఇళ్లు కట్టించాం.. మరి మీ హయాంతలో ఏం చేశారు అని జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. ఐతే వైసీపీ పార్టీ హ్యాండిల్‌తో పాటు మంత్రి జోగి రమేష్ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి దీని మీద ట్వీట్లు పడ్డాయి. చంద్రబాబు హయాంలో ఇక్కడ పునాదులు కూడా పడలేదని.. జగనే ఈ ఇళ్లు కట్టించారని పేర్కొంటూ నాడు-నేడు అంటూ ఏవో ఫొటోలు పెట్టి ఫేక్ ట్వీట్లు వేసేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడే తీసిన ఫొటోలు.. అక్కడ చంద్రబాబు పర్యటిస్తున్న ఫొటోలు కూడా పాత డేట్లతో ట్విట్టర్లో కనిపిస్తుంటే.. వైసీపీ అఫీషియల్ హ్యాండిళ్ల నుంచి దీనికి భిన్నంగా ఫేక్ ప్రచారాలతో ట్వీట్లు వేయడం.. కింద ఇవి టీడీపీ కట్టించిన ఇళ్లని ఆధారాలతో సహా చూపిస్తున్నా కూడా ఆ ట్వీట్లు డెలీట్ చేయకుండా ఫేక్ ప్రచారాలను కొనసాగిస్తుండటం విడ్డూరం. వైసీపీ వాళ్లకు మాత్రమే ఇది చెల్లు అంటూ టీడీపీ వాళ్లే కాక న్యూట్రల్ నెటిజన్లు సైతం ఆ పార్టీ తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు.
మేము ఫేక్ చేయడం కాదు మీ @ncbn ప్రభుత్వంలో మీరే దోపిడీ చేశారు. టిడ్కో ఇళ్ళకు @ysjagan గారి ప్రభుత్వంలో రూ.8,734 కోట్లు ఖర్చు చేయడంతో పాటు మీరు వదిలివెళ్ళిన రూ.3 వేల కోట్ల బకాయిలను తీర్చాం. మీరు అస్తవ్యస్తంగా నిర్మించిన ఇళ్ళకు మేము రూ.725 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. (1/2) https://t.co/TYZso2W15F
— YSR Congress Party (@YSRCParty) April 8, 2023
అంటే అవి కట్టింది చంద్రబాబు అనే వైసీపీ తన ట్వీట్ ద్వారా ఒప్పుకుంది. కానీ అదే ట్వీటులో మేము ఫేక్ చేయలేదు అంటోంది. వామ్మో!!