ఇప్పటివరకు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉన్నారు. ఎందుకంటే.. తాము ఉత్సవ విగ్రహా లుగా మారామని.అన్నీ కూడా వలంటీర్లే చేసుకుంటారని.. దీంతో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిం దని వారు భావిస్తున్నారు.
అయితే.. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వలంటీర్ల ప్రమేయంతోనే ఎక్కువగా లబ్ధి పొందారని.. ఆఫ్ దిరికార్డుగా కీలక సలహాదారు.. చెప్పుకొచ్చారట. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇప్పుడు అలెర్ట్ అయ్యారు.
నిజానికి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది వలంటీర్లను నియమించారు. ప్రతి వలంటీర్‌కు 50 ఇళ్లను అప్పగించారు.
ఆయా ఇళ్లకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంతోపాటు.. ఆయాకుటుంబాల రాజకీయ పరిస్థితి.. వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. వారిలో ఎవరు రాజకీయంగా దూకుడుగా ఉన్నారు.? అనే అంశాలను కూడా సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి ముఖ్యంగా పార్టీకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన రాజకీయ అంశాలు కూడా తెలిసిపోతు న్నాయి. దీంతో టీడీపీ లేదా.. ఇతర పార్టీలకు సానుభూతిగా ఉన్న కుటుంబాలను.. వైసీపీవైపు మళ్లించే ప్రయత్నం .. ఇటీవల జరిగిన స్థానిక సమరంలో వలంటీర్లే తీసుకున్నారని అంటున్నారు. అంటే.. ఆయా కుటుంబాలు రాజకీయంగా ఏం కోరుకుంటున్నాయి.
వారి డిమాండ్లు ఏంటి తెలుసుకుని.. సలహాదారు నేతృత్వంలోని కమిటీకి అందచేస్తున్నారట. దీంతో అప్పటికప్పుడు తీర్చే సమస్యలు ఉంటే.. వెంటనే పరిష్కరించడం ద్వారా.. ప్రతి కుటుంబాన్నీ.. వైసీపీకి చేరువ చేస్తున్నారట.
దీంతో ఇప్పుడు ఇదే విషయాన్ని సలహాదారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరీ చెప్పారట. వలంటీర్ వ్యవస్థ అంటే ఏమనుకున్నారు. రేపు మిమ్మల్ని గెలిపించేది కూడా అదే వ్యవస్థ. కాబట్టి వారిని కించపరచొద్దు. వారితో సఖ్యతగా మెలగండి అని సూచించి.. తెరవెనుక జరిగిన పరిణామాలను కూడా వివరించారట.
దీంతో అప్పటి వరకు ఈ విషయాలు తెలియని చాలా మంది ఎమ్మెల్యేలు.. ఖంగు తిన్నారట. ప్రస్తుతం ఈ విషయం పార్టీలో గుసగుసగా వినిపిస్తుండడం గమనార్హం.