https://twitter.com/nodrama5678/status/1520273172406235137
ఏపీ అధికార పార్టీ వైసీపీలో వర్గ పోరు హత్యా రాజకీయాలకు దారితీసింది. వర్గ పోరు కారణంగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కుటుంబానికి పరామర్శించేందుకు వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రత్యర్థి వర్గం.. పిడిగుద్దులు కురిపించింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏం జరిగింది..
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. జి.కొత్తపల్లిలో వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైసీపీ నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గ్రామంలోని వైసీపీలో ఇరువర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే గంజి ప్రసాద్ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపిస్తోంది.
అందువల్లే ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు సమాచారం. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేను.. పార్టీలోని ఓ వర్గం అడ్డుకుంది. కొందరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు. అయినా.. కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసులు ఆయనను ఉంచిన చోట ఆందోళనకు దిగారు. దీంతో.. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, హత్యలు, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న అధికార వైకాపా కు ఈరోజు సొంత పార్టీ వ్యక్తుల చేతిలో తన్నులు తిన్న YCP MLA తలారి వెంకట్రావు ఉదంతంతో కనువిప్పు కలగాలి. ప్రజాస్వామ్యం పై నమ్మకం లేక దౌర్జన్యాలకు తెగబడితే ప్రజలే బుద్ధి చెబుతారు. pic.twitter.com/OhP7TCh7x2
— Anitha Vangalapudi (@Anitha_TDP) April 30, 2022