సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణ మొత్తం పర్యటించి కేసీఆర్ ను కమ్మేస్తామని అన్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ తనను తాను రైతునని చెప్పుకుంటుంటారని, కానీ, రైతులకు అండగా ఉండరని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చెప్పినట్టు పంటలు వేసిన రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వని కేసీఆర్… రైతు బీమా ఇస్తామనడం దారుణమన్నారు. పల్లీలు, బఠానీలిచ్చి లాక్కున్న భూములను ప్రైవేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. కడ్తాల్, కందుకూరు రైతుల మీద పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కుప్పగండ్లతో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిరిజనులకు చెందిన 400 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. తక్షణమే ఆ భూములను గిరిజనులకు ఇవ్వకుంటే అక్కడ పర్యటిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, వైఎస్ఆర్ సేవకుడిగా పేరు తెచ్చుకున్న సూరీడు…ఆయన మరణం తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి సభలో సూరీడు ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. సూరీడు సభా వేదికపై రేవంత్ సరసనే కనిపించడం, ఫోటో దిగడం పలువురికి ఆశ్చర్యాన్నికలిగించింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతోన్న నేపథ్యం…కాంగ్రెస్ నేతలంతా ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సూరీడు వ్యవహారం చర్చనీయాంశమైంది.