పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే నేడు గేటు కొట్టుకుపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాటి మహా మేత వైఎస్ హయాంలో….ఆయన తనయుడు, నేటీ సీఎం జగన్ అడ్డగోలుగా తన అనుకూల కంపెనీలకు టెండర్లు కట్టబెట్టినందువల్లే నేడు పులిచింతల ప్రాజెక్టు పటిష్టత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు గుప్పతిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. వైఎస్ హయాంలో పులిచింతల ప్రాజెక్టులో ఎన్నో అక్రమాలు జరిగాయిని, నాటి నాసిరకం పనుల వల్లే నేడు గేటు కొట్టుకుపోయిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగిందని, ప్రాజెక్టుల ముసుగులో వేలకోట్ల అవినీతి జరిగిందని, దాని పర్యవసానమే పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడమని విమర్శించారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, కుంభకోణాలు చేసి స్కీమ్‌లకు ఆ నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే దిక్కు లేక కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు. నిబంధనల పేరుతో భారీగా రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధిస్తున్నారని, ఆర్టీసీ ఆస్తులు ఆర్ అండ్ బికి అప్పగించడాన్ని ఖండించారు.
మరోవైపు, పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. టీడీపీ హయాంలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుంచి 16శాతానికి, నూలుపై సబ్సిడీని 10 నుంచి 40శాతానికి పెంచామన్నారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీ ఇచ్చామని, వర్షాకాల భృతి అందించామని అన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామని… ఆదరణతో పనిముట్లు అందజేసి అండగా నిలిచామని గుర్తు చేశారు.