అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న తన బావ గారిని బామ్మర్ది నందమూరి బాలకృష్ణ పలు ప్రశ్నలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు తన బామ్మర్ది అడిగిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా, సరదాగా, సీరియస్ గా జవాబిచ్చారు. తాను బాలకృష్ణ కంటే రొమాంటిక్ అని కాలేజీ రోజుల్లో బాలకృష్ణ కంటే ఎక్కువ చేసామని చంద్రబాబు అన్న మాటలు వైరల్ గా మారాయి.
ఇక, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చంద్రబాబును బాలకృష్ణ అడగగానే…ఏమాత్రం తడుముకోకుండా వైయస్ రాజశేఖర్ రెడ్డి తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చంద్రబాబు చెప్పడం విశేషం. తాను, వైయస్ బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఇద్దరం ఒకే గదిలో పడుకునే వాళ్ళమని అన్నారు. తాము ఎంత క్లోజ్ గా ఉండేవాళ్లమో 1977, 83 సంవత్సరాలలో ఉన్న నేతలకు తెలుసని చంద్రబాబు చెప్పారు. ఈ విషయం బాలకృష్ణకు కూడా తెలుసని అన్నారు.
అయితే, రాజకీయంగా తాము ప్రత్యర్థులమని, తాను టిడిపిలోకి వచ్చేశానని, కానీ, రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో ఉండిపోయారని అన్నారు. తనకు, రాజశేఖర్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉందని, వ్యక్తిగతంగా విరోధం లేదని చంద్రబాబు చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చిన నేపథ్యంలో తాజాగా తాను, వైయస్సార్ మంచి మిత్రులం అని చంద్రబాబు చెప్పిన మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఓన్ చేసుకున్నట్టుగానే వైఎస్ఆర్ ని కూడా టిడిపి నేతలు ఓన్ చేసుకోవాలన్న పొలిటికల్ స్ట్రాటజీతో చంద్రబాబు పరోక్షంగా ఆ కామెంట్లతో సంకేతం ఇచ్చారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వైయస్ అభిమానులను, జగన్ వ్యతిరేకులుగా ఉన్న వైఎస్ అభిమానులను టిడిపి ఓటు బ్యాంకుగా మార్చుకోవచ్చు అన్న ఆలోచన చంద్రబాబుకు ఉన్నట్లుగా కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.