కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కేసు తేలడం లేదు. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని కోరి, ఎన్నికల అనంతరం సీబీఐకి ఇవ్వద్దు అని పిటిషను ఉపసంహరించుకోవడంతో అసలు ఈ హత్యపై అప్పటి నుంచి ప్రజలకు అనుమానాలు బలపడ్డాయి.
ఆ తర్వాత కూతురు సీబీఐకి ఇవ్వాలని కోరడం, అనుమానితుల పేర్లు బయటపెట్టడం వీటన్నింటి నేపథ్యంలో అసలు ఈ హత్య ఎందుకు జరిగిందో కూడా జనం అంచనా వేయడం మొదలుపెట్టారు. దీనిపై న్యాయం కావాలని, హంతకులను త్వరగా పట్టుకోవాలని వివేకా కూతరు డాక్టరు సునీత పోరాడుతున్నారు.
ఈ పోరాటంలో ఆమెకు బెదిరింపులు పెరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులకు భద్రత లేకుంటే ఏపీ లో పరిస్థితి ఏంటో జగనే చెప్పాలి.
తాజాగా వైఎస్ సునీత కడప జిల్లా ఎస్పీని కలిశారు. పులివెందులలో తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆమె ఈ వినతి చేశారు.
ఇక వివేకా కేసు ఇంకా సాగుతోంది. కరోనా కూడా ఈ కేసు ఆలస్యానికి కొంతకారణం అనుకోవచ్చు. ప్రస్తుతం వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ పునఃప్రారంభం అయ్యింది.
సీబీఐ బృందం కడపలో అనుమానితులను ప్రశ్నిస్తూ దర్యాప్తు చేస్తోంది. 2019 మార్చి 15న సరిగ్గా ఎన్నికల ముందు వివేకాను పులివెందులలోని ఆయన నివాసంలో చంపారు.
అప్పట్లో ఇది గుండెపోటు అని సాక్షి చెప్పిన అబద్ధం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు.