సోషల్ మీడియా దూకుడు పెరిగిన తర్వాత.. నెటిజన్లు అన్నివిషయాల్లోనూ ఎలాంటి నిర్మొహమాటం లేకుండానే రియాక్ట్ అవుతున్నారు. అంశం ఏదైనా సరే.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఏపీ విషయంలోనూ అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ విషయంలో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. “జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా“ హ్యాష్ ట్యాగ్‌తో ఉన్న ట్వీట్ జోరుగా ట్రెండ్ అవుతోంది.
దాదాపు 12 వేల మంది పైచిలుకు ఈ ట్వీట్‌పై కామెంట్లు, రీట్వీట్లు చేశారంటే.. నెటిజన్లలో రియాక్షన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఇక్కడ నెటిజన్లు ఒక విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సొంత బాబాయి చనిపోయి.. నాలుగేళ్లు(బుధవారంతో) అయింది. సీఎం జగన్ కనీసం ఆయన ఫొటోకు ఒక్క పువ్వు కూడా వెయ్యలేదు.. అని నిట్టూరుస్తున్నారు. మరికొందరు అబ్బాయికి బాబాయి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడెక్కడో ఎవరెవరో చనిపోతేనే వారికి నివాళులర్పిస్తున్న జగన్.. సొంత బాబాయి.. తండ్రి సోదరుడు హత్య జరిగిన రోజును మరిచిపోయారా? బాబాయి అసలు గుర్తే లేరా? అని నిలదీస్తున్నారు. ఇంత కన్నా దారుణం ఏంటని ప్రశ్నించారు. మరికొందరు `రిప్` అంటూ తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా నివాళులర్పించారు.
ఇదిలావుంటే, వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై నేటికి నాలుగేళ్లు గడిచింది. ఈ రక్తచరిత్రలో పాత్రధారులు చిక్కినా.. సూత్రధారులు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, అనుమానితులు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కోర్టు మెట్లెక్కడంతో.. కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వివేకా హత్య కేసులో మూడు సిట్లు చేసిన దర్యాప్తు, ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతున్న తీరు సర్వత్రా ఆసక్తిగానే మారింది. చివరకు ఏం తేలుతుందో చూడాలి.