సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో… సీబీఐ విచారణ తిరిగి ప్రారంభమైంది. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప సెంట్రల్ జైల్.. క్యాంప్ ఆఫీస్లో విచారణ కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం గత 2019 ఎన్నికలకు సరిగ్గా మూడు మాసాల ముందు జరిగిన వివేకా హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలసిందే.
దీనిపై అనేక రాజకీయ విమర్శలు, వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం, న్యాయ పోరాటం.. వంటి అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. హత్య జరిగే నాటికి కడప వైసీపీ ఎన్నికల పరిశీలకుడిగా వివేకా ఉన్నారు. దీంతో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తొలుత దీనిని గుండెపోటుగా.. తర్వాత.. హత్యగా వైసీపీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక, అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుపై అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుతం సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
సీబీఐకి కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు. తర్వాత తనే అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీబీఐకి ఇవ్వకుండా తాత్సారం చేయడంపై ఏకంగా వివేకా సతీమణి, కుమార్తెలు ఇద్దరూ కూడా అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసును ఎట్టకేలకుసీబీఐ విచారణకు చేపట్టింది. పులివెందుల, కడపలో పలువురిని అధికారులు ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే గత ఏడాది కొంతమంది సీబీఐ అధికారులకు కరోనా సోకిన కారణంగా.. ఉన్నఫళంగా విచారణ నిలిపేశారు. 7 నెలల అనంతరం మళ్లీ విచారణకు వచ్చిన అధికారులు.. ఇదివరకే ప్రశ్నించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి కేసులోని కీలక వ్యక్తులను సీబీఐ ప్రశ్నించే అవకాశముంది. ఇదిలావుంటే, ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పేర్లను వివేకా కుమార్తె.. పేర్కొన్న విషయం తెలిసిందే.