మరికొద్ది గంటల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ భారీ షాక్ ఇచ్చారు. తన బిడ్డ వైఎస్ షర్మిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కడప ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ విజయమ్మ విడుదల చేసిన వీడియో జగన్ తో పాటు వైసీపీ శ్రేణులకు షాకిచ్చింది. షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుందని, కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం శ్రమలకు కల్పించాలని వైఎస్సార్ ను అభిమానించే ప్రేమించే వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. షర్మిలను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని విజయమ్మ ప్రజలను ప్రార్థించారు.
ఓ వైపు కుమారుడు జగన్, మరో వైపు కుమార్తె షర్మిల…ఇలా చాలారోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ లోకి వెళ్లకుండా విజయమ్మ దూరంగా ఉంటున్నారు. అమెరికాలో షర్మిల కుమారుడు రాజారెడ్డి దగ్గర ఉంటూ విజయమ్మ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, తాజాగా విజయమ్మ విడుదల చేసిన వీడియతో వైఎస్ ముద్దు బిడ్డ షర్మిల అని చెప్పకనే చెప్పారు విజయమ్మ. జగన్ బలపరిచిన అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ అభిమానులు ఓటు వేయొద్దని విజయమ్మ పరోక్షంగా చెప్పినట్లయింది. షర్మిల వైఎస్ వారసురాలు అని విజయమ్మ ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఊపిరున్నంత వరకు ప్రజా సేవకే వైఎస్ఆర్ అంకితమయ్యారని, ప్రజా సేవ చేస్తూనే చనిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాఉంది. ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్ కు పంపమని, తండ్రిలాగే సేవ చేసుకునే అవకాశాన్ని ఇవ్వమని కడప ప్రజలను ప్రార్థిస్తున్నానని విజయమ్మ చెప్పారు.