వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అరెస్టు నేపథ్యంలో వైయస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను కలుసుకునేందుకు బయలుదేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు లోటస్ పాండ్ దగ్గరే అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన విజయమ్మ తన ఇంటిలోనే నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు.
తన కూతురిని చూసేందుకు వెళ్తే పోలీసులకు ఇబ్బంది ఏమిటని విజయమ్మ నిలదీశారు. పోలీసులు ఎదుటే ఆమె దీక్షకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా విజయమ్మను మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. షర్మిల అరెస్టు తదితర పరిణామాలపై సీఎం జగన్ ఏమన్నా మాట్లాడారా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు విజయమ్మ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
‘‘ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో.. ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా’’ అంటూ విజయమ్మ నవ్వుతూ బదులిచ్చిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది. షర్మిల అన్నగా జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్టు గురించి ఏమన్నారు అని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించినా విజయమ్మ అదే సమాధానం ఇచ్చి దాటవేశారు. తన కూతురు ఏం నేరం చేసిందని, పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని విజయమ్మ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దాడులు చేస్తారా అని మండిపడ్డారు.
షర్మిల రాయలసీమ బిడ్డ అనేది ముఖ్యం కాదని, షర్మిల పుట్టింది పెరిగింది తెలంగాణలోనే అని విజయమ్మ అన్నారు. అంతేకాదు, మనవాళ్లు పరాయి దేశాల్లో ప్రధానులు అవుతున్నారని, ఇంకా షర్మిల అది రాయలసీమ అని మాట్లాడడం ఏమిటని విమర్శించారు. వైయస్సార్ తెలంగాణ వ్యతిరేకా కాదా అన్నది రాబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలతో, జగన్ తో తమకు సంబంధం లేదంటూ విజయమ్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.