వైఎస్ కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయని, ఆ క్రమంలోనే అన్న సీఎం జగన్ తో విభేదించిన వైఎస్ షర్మిల తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జగన్ వైఖరి నచ్చకే…విజయమ్మ కూడా కూతురికే సపోర్ట్ చేస్తున్నారని టాక్ వచ్చింది. ఇక, ఇడుపుల పాయలో వైఎస్ కు నివాళులు అర్పించే సమయంలో కూడా అన్నాచెల్లెళ్లు కలవకపోవడంతో ఆ విభేదాలు తారస్థాయికి చేరాయి.
దీంతో, జగన్ తో విజయమ్మ కూడా ముభావంగా ఉంటున్నారన్న వదంతులు వ్యాపించాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో అన్నా చెల్లెళ్లు కలుసుకున్నా…ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఇక, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా ఏపీలో కొత్త పార్టీ దిశగా క్రిస్టియన్ సంఘాల నేతలతో చర్చలు జరపడం వంటి పరిణామాలు అన్నాచెల్లెళ్ల మధ్య అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. వారిద్దరి మధ్య గ్యాప్ ఉందని టాక్ ఉన్న సమయంలో రేపు ఇడుపుల పాయలో అన్నా చెల్లుళ్లు కలుసుకోబోతున్నారు.
అయితే, రేపు, ఎల్లుండి జరగబోయే వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనేచాలా రోజుల తర్వాత కొడుకు జగన్ తో పాటు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ విజయమ్మ రెడీ అయ్యారని అఫీషయల్ గా ప్రకటన వెలువడింది. రెండవ రోజు ప్లీనరీలో విజయమ్మ ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ప్రసంగించనున్నారు. అయితే, ప్లీనరీ ముగిసన తర్వాత విజయమ్మ తన పొలిటికల్ కెరీర్ పై సంచలన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విజయమ్మ…కొడుకు, కూతురిల కోల్డ్ వార్ మధ్య నలిగిపోతున్నారని టాక్. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు మద్దతుగా ఉండేందుకు వైసీపీకి విజయమ్మ దూరం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.